
IPL : చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (35), డెవాన్ కాన్వే (56), రహానె (71 నాటౌట్), శివమ్ దూబె (50) చెలరేగడంతో ధోని సేన భారీ స్కోర్ సాధించింది. చెన్నై బ్యాటర్లు ఫోర్లు కంటే సిక్సులే ఎక్కువగా కొట్టారు. మొత్తం 14 ఫోర్లు, 18 సిక్సులు బాదారు.
కోల్ కతా బౌలర్లలో కుల్వంత్ కు 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, సుయాంశ్ శర్మకు తలో వికెట్ దక్కాయి. సుయాంశ్ మినహా మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. చెన్నై బ్యాటర్లను ఏమాత్రం అడ్డుకోలేకపోయారు.
236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా ఆదిలోనే తడబడింది. ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు నారాయణ్ జగదీశన్ (1), సునీల్ నరైన్ (0) దారుణంగా విఫలమయ్యారు. వెంకటేష్ అయ్యర్ (20), నితీశ్ రాణా (27) కాసేపు నిలబడినా భారీ స్కోర్ సాధించలేకపోయారు. దీంతో నైట్ రైడర్స్ 70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ జెసన్ రాయ్ (61), రింకూ సింగ్ ( 53 నాటౌట్ ) హాఫ్ సెంచరీలతో పోరాటం చేశారు. అయితే చివరికి కోల్ కతా 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై 49 పరుగుల తేడాతో గెలిచింది.
విధ్వంసకర బ్యాటింగ్ తో చెన్నై భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన రహానెకు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తాజా విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ధోని సేన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించింది. 2 మ్యాచ్ ల్లో మాత్రమే ఓడింది.