
Chalaki Chanti : జబర్దస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు చంటి. ఆ షో లో చలాకీ చంటిగా ప్రేక్షకులను ఎంతోగానే నవ్వించాడు. అదే తన పేరుగా మారిపోయింది. నటుడిగా మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. వివిధ కామెడీ షోల్లో తన చలాకీ నటనతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని నటుడిగా ఎదుగుతున్నాడు. ఇలా కెరీర్ లో ముందుకెళుతున్న సమయంలో చలాకీ చంటి అస్వస్థతకు గురికావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
చంటికి తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో ఈ నెల 21న కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చంటి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలించి గుండెపోటుగా నిర్ధారించారు. వైద్య పరీక్షలు నిర్వహించి రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు తేల్చారు.
చంటికి స్టంట్ వేసినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించారు. చలాకీ చంటికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు వివరించారు. అతను త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.