Revanth – Trisha: మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఐసీసీ అండర్ 19 మహిళల టి-20 ప్రపంచ కప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష.. భారత జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో గొంగడి త్రిష.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా త్రిషను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read: ICC T20I Rankings: నెంబర్ 1 జట్టుగా టీమిండియా…టాప్ 5 లోకి దూసుకొచ్చిన ఈ ప్లేయర్స్!
భవిష్యత్తులో దేశం తరఫున మరింత పెద్ద స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. గొంగడి త్రిషకు రూ. కోటి రూపాయల నజరానా ప్రకటించారు. అలాగే అండర్ 19 వరల్డ్ కప్ టీమ్ హెడ్ కోచ్ నోషీన్, ట్రైనర్ శాలినికి పది లక్షల చొప్పున నజరానా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
వీరితోపాటు అండర్ 19 వరల్డ్ కప్ జట్టు సభ్యురాలు అయిన తెలంగాణ క్రికెటర్ ధృతి కేసరికి పది లక్షలు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు అన్ని విధాల సహకరిస్తుందని తెలిపారు సీఎం రేవంత్. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తదితరులు పాల్గొన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఐసీసీ అండర్ 19 మహిళల టి-20 ప్రపంచ కప్ లో గొంగడి త్రిష ఆల్ రౌండ్ ప్రదర్శనకు గాను ఆమెను “ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్” గా ఎంపిక చేశారు. ఇక ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రోజున ఆమె తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆమెకు ఘన స్వాగతం పలికారు. త్రిషను ఆదర్శంగా తీసుకొని మరింత మంది మహిళా క్రికెటర్లు తెలంగాణ నుంచి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read: Rohit Sharma Retirement: రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ పై డేట్ ఫిక్స్?
జట్టు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని.. ఇకపై మరింత కష్టపడి సీనియర్ జట్టులో చోటు సాధించడమే తన లక్ష్యమని తెలిపింది. తన ప్రతి విషయంలోనూ తన నాన్న ఉన్నారని పేర్కొంది. స్పోర్ట్స్ ని తమ కెరియర్ గా ఎంచుకోవచ్చని, సత్తా చాటితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపింది. ఇక ఐసీసీ అండర్ 19 మహిళల టి-20 ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో ఏడు మ్యాచ్ లలో గొంగడి త్రిష 309 పరుగులు చేసింది. వరల్డ్ కప్ గెలవడంలో “కీ” ప్లేయర్ గా నిలవడమే కాదు.. మంచి ఫామ్ లో ఉంటూ యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144 తో క్రీడాభిమానులను అలరించింది. గొంగడి త్రిష నుంచి మున్ముందు మరిన్ని అద్భుతమైన రికార్డులను ఇండియా చూడడం ఖాయం.
జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన క్రికెటర్ గొంగడి త్రిష
అండర్ -19 ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించిన త్రిష ను అభినందించిన ముఖ్యమంత్రి
గొంగడి త్రిషకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/5xtzdUNKmB
— BIG TV Breaking News (@bigtvtelugu) February 5, 2025