Rohit Sharma Retirement: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి మరోసారి చర్చ మొదలైంది. 2024 లో టి-20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం వన్డేలు, టెస్ట్ లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా మరో రెండు వారాల్లో ప్రారంభం కాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగనుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సమాచారం.
Also Read: SRH: ఒకటి కాదు 5 బుల్డోజర్లు.. గట్టు దాటితేనే వేసేస్తాం… భయంకరంగా మారిన SRH టీం?
ఎందుకంటే టీమిండియా భవిష్యత్తు సారథ్యంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 – 27 సీజన్, 2027 వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును సిద్ధం చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం రోహిత్ శర్మ తన భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టత ఇవ్వాలని బీసీసీఐ అతడిని అడిగినట్లు సమాచారం. నిజానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
తాను మరికొంత కాలం పాటు కెప్టెన్ గా, ప్లేయర్ గా కొనసాగుతానని.. ఆ తర్వాత భవిష్యత్తు నిర్ణయం గురించి చెబుతానని రోహిత్ శర్మ బిసిసిఐకి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకోబోతున్నాడని సమాచారం. ఓ వార్తాపత్రిక నివేదిక ప్రకారం.. జూన్ – జూలైలో టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించబోతోంది. ఈ పర్యటనకు రోహిత్ శర్మ ఎంపిక అయ్యే అవకాశం లేదు.
ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీతోనే అతడి అంతర్జాతీయ కెరీర్ ముగియనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మూడు లీగ్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. చివరి లీగ్ మ్యాచ్ మార్చి 2న జరగనుంది. ఒకవేళ జట్టు సెమీఫైనల్ వరకు వెళ్లలేకపొతే మార్చి 2 రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ లో చివరి రోజు కావచ్చు. ఒకవేళ సెమీఫైనల్ చేరి అక్కడ ఓడిపోతే మార్చి 4న రోహిత్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు.
ఒకవేళ జట్టు ఫైనల్ వరకు వెళితే మార్చు 9న రోహిత్ కెరీర్ లో చివరి రోజు కావచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అతడి స్థానంలో రెండు ఫార్మాట్లకు కెప్టెన్ ను నియమించాలి. టెస్టులకు బుమ్రా, పంత్, యశస్వి జైష్వాల్ పేర్లను బీసీసీఐ పరిశీలిస్తుండగా.. వన్డేలకు గిల్, పంత్ పేరును పరిశీలిస్తున్నారట.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఆస్ట్రేలియా కు ఎదురు దెబ్బ.. ఆ ప్లేయర్ దూరం!
ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సీజన్ తో పాటు వన్డే ప్రపంచ కప్ 2027 కోసం జట్టును సిద్ధం చేసేందుకు బీసీసీఐ సమాయత్తం అవుతుంది. ఇందులో భాగంగా సీనియర్ల భవితవ్యం పై ఓ స్పష్టత కోరే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. రోహిత్ శర్మతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ బాగుందని.. అతడు మరికొన్నేళ్లు జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం.