HCA – SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో ప్రస్తుతం ఓ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళ్ళిపోతామంటూ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమకు వస్తున్న బ్లాక్ మెయిల్స్.. బెదిరింపులే ఇందుకు కారణమని ఆ జట్టు మేనేజ్మెంట్ చెబుతోంది. ఇకముందు కూడా ఇలానే వేధింపులు ఎక్కువ అయితే ఇక హైదరాబాద్ నగరాన్నే వీడి ఫ్రాంచైజీ వెళ్ళిపోతుందని హెచ్చరించింది.
ఈ సీజన్ లోని ఐపీఎల్ మ్యాచ్ ల ఉచిత పాస్ ల కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ని.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా వేధిస్తున్నట్లు సన్రైజర్స్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ.. శ్రీనాథ్ లేఖలో పేర్కొన్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.
వారు కోరినన్ని పాస్ లు ఇవ్వని కారణంగా.. తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్ కి తాళాలు వేశారని శ్రీనాథ్ చాలా రోజుల తర్వాత బయటపెట్టినట్లుగా ఓ లేఖ వైరల్ గా మారింది. హెచ్సీఏ అధ్యక్షుడి ప్రవర్తనను బట్టి చూస్తే ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ ఆడడం ఇష్టం లేనట్టుగా అనిపిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం.. తమ యాజమాన్యంతో మాట్లాడి మరొక వేదికకు మారిపోతామని రాసుకొచ్చారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుండి గత రెండు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఇలా ఈ లేఖ సోషల్ మీడియాలో, అటు టీవీలో కూడా వైరల్ గా మారడంతో.. ఈ వార్తలపై ఆదివారం రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ” సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అధికారిక ఈమెయిల్స్ నుండి హెచ్సీఏ అధికారిక ఈమెయిల్ కి ఎటువంటి మెయిల్స్ రాలేదు. సోషల్ మీడియా, పలు వెబ్సైట్లలో ప్రచారం అవుతున్న వార్తల్లో వాస్తవం లేదు.
ఒకవేళ నిజంగానే ఈమెయిల్స్ వచ్చి ఉంటే ఆ సమాచారం హెచ్.సీ.ఏ లేదా ఎస్.ఆర్. హెచ్ అధికారిక ఈమెయిల్ నుండి కాకుండా గుర్తుతెలియని ఈమెయిల్స్ నుండి లీక్ చేయడం వెనుక ఉన్న కుట్ర ఏంటి..? హెచ్సీఏ – ఎస్.ఆర్.హెచ్ {HCA – SRH} ప్రతిష్టను మసకబార్చేందుకే కొందరు పనిగట్టుకుని ఈ దుష్ప్రచారం చేస్తున్నారు” అని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ వ్యవహారం పై వివరాలను సేకరించింది తెలంగాణ సీఎమ్ఓ కార్యాలయం. సన్ రైజర్స్ యాజమాన్యానికి వేధింపుల వ్యవహారంపై ఆరా తీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై ఇప్పటికే వివరాలను సేకరించిన రేవంత్ రెడ్డి.. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దర్యాప్తు తరువాత కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేదిలేదని ఆయన తేల్చి చెప్పారు. విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఎంట్రీతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.