AP-Telangana : అతనో క్రికెటర్. మంచి ఆటగాడే. ఇండియన్ టీమ్‌కు సెలెక్ట్ కావాలనుకున్నాడు. ఐపీఎల్‌లో అయినా ఆడాలని కలలు కన్నాడు. అలా కోట్ల మంది యువకుల్లా అతనూ పెద్ద పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. కానీ రియాల్టీ వేరు. ఆంధ్ర క్రికెట్ టీమ్ తరఫున ఆడాడు. ఆ తర్వాత అంతే సంగతి. స్టేట్ లెవెల్ ప్లేయర్‌కే పరిమితం అయ్యాడు.
ఒక ఐడియా.. జీవితాన్ని మార్చేసింది..
అతడి పేరు నాగరాజు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట అతని ఊరు. క్రికెట్ ఆడినన్నా్ళ్లు ఆడాడు. అదేమీ కడుపు నింపలేదు. ఉద్యోగం లేదు. వ్యాపారం చేయలేడు. మరి బతికేదెట్టా? కోరికలేమో ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఏకంగా రేంజ్ రోవర్ కారులోనే తిరగాలని కలలు కన్నాడు. అది కుదరలేదు. షార్ట్ టైమ్‌లో కోటీశ్వరుడిని కావాలంటే ఏం చేయాలా అని ఆలోచించాడు. ఓ ఖతర్నాక్ ఆలోచన వచ్చింది. ఆ ఐడియా తన జీవితాన్నే మార్చేస్తుందని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆ పని అతని లైఫ్‌ను ఊహించనంతగా మార్చేసింది. తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టింది. ఇంతకీ అతనేం చేశాడు? ఆ ఐడియా ఏంటి?
సీఎంకు OSD అంటూ పైసా వసూల్
శ్రీకాకుళంకు చెందిన నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను సీఎం రేవంత్‌రెడ్డికి OSD అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. సీఎం ఓఎస్‌డీ పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి.. పలువురు ప్రముఖులకు బెదిరింపు మెసేజ్‌లు పంపించాడు. ర్యాపిడో కంపెనీకి అలానే మెయిల్ చేసి.. డబ్బులు సర్దాలని కోరాడు. కంట్రీ డిలైట్ క్లబ్ ఎండీకి ఫోన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఓనర్లకు సైతం ఇలానే వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్లు, ఈ మెయిల్స్‌తో మోసాలు, బెదిరింపులు చేస్తున్నాడు.
అరెస్ట్.. రిమాండ్..
సీఎం పేరు చెప్పి చీటింగ్ చేస్తుంటే మేటర్ పోలీసులకు తెలీకుండా ఉంటుందా. కంప్లైంట్ రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. నిఘా పెట్టి నాగరాజును పట్టుకున్నారు. ఐటీ యాక్ట్ 66C, 66D, 319(2) BNS చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
క్రికెటర్‌పై 30 కేసులు..
ఇప్పటికే నాగరాజుపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 వరకూ కేసులు ఉన్నాయి. తెలంగాణలో 13, ఏపీలో 16 కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉంది. అయినా, ఇలా నేరాలకు పాల్పడుతున్నాడు. ఆట బంతితోనే ఆడాలి.. బతుకులతో ఆటాడాలని అనుకుంటే.. ఇలానే చిప్పకూడు తినాల్సి వస్తుందనే లాజిక్ మిస్ అయ్యాడు.