
Rohit Sharma : అప్రతిహిత విజయాలతో దూసుకుపోతున్న ఇండియా సెమీస్ గండం దాటేసింది. కివీస్ తో జరిగిన సెమీస్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు. వాళ్లిద్దరూ మమ్మల్ని భయపెట్టారని అన్నాడు. వాళ్లిద్దరూ అంటే ఎవరని అనుకుంటున్నారా? వారే నండీ కివీస్ కెప్టెన్ విలియమ్సన్ , డారెల్ మిచెల్ ఇద్దరూ కూడా మా బౌలర్స్ కి కొరుకుడు పడలేదు. ఒక పట్టానా అవుట్ కాలేదు. అసాధారణ బ్యాటింగ్‌తో మా వాళ్లని ఒత్తిడిలోకి నెట్టారని చెప్పాడు.
వాంఖేడి స్టేడియంలో నేను చాలా కాలం నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఇక్కడెంత భారీ స్కోరు చేసినా రిలాక్స్ గా ఉండలేమని అన్నాడు. సింపుల్ గా కొడుతున్నారు. స్కోరు నడిపించేస్తున్నారు. ఎక్కడా రన్ రేట్ కంట్రోల్ కావడం లేదు, వికెట్లు పడటం లేదు.
విజయం కోసం చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. కానీ ఎవరికి లొంగని పిచ్ ఒక్క మహ్మద్ షమీకే లొంగిందని అన్నాడు.ఈ మ్యాచ్‌లో మాపై ఒత్తిడి ఉంటుందనేది తెలుసు. అందుకే ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేసినా ప్రశాంతంగానే ఉన్నాం. ఆటలో ఇవన్నీ జరగడం సహజమే. అయితే ఈ మ్యాచ్‌లో ఆశించిన ఫలితాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని అన్నాడు.
టీమ్ ఇండియాలో అందరినీ పేరుపేరునా రోహిత్ అభినందించాడు. అందరికన్నా ముఖ్యంగా మహమ్మద్ షమీ గురించి చెబుతూ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఆ అద్భుతమనే పదం చాలా చిన్నదని అన్నాడు. జట్టులోని ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారని తెలిపాడు.
ముఖ్యంగా టాప్-5 బ్యాటర్లు అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగుతున్నారు. ఈ టోర్నీలో అయ్యర్ రాణిస్తున్న విధానం చూడ ముచ్చటగా ఉంది. గిల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కితాబిచ్చాడు. కోహ్లీ ఎప్పటిలానే చెలరేగి తన ల్యాండ్ మార్క్ సెంచరీతో సత్తా చాటాడని తెలిపాడు. సహచరులందరూ రికార్డులు బ్రేక్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నాడు.
ప్రతి మ్యాచ్ లో ఒత్తిడి ఉంటుంది. కాకపోతే సెమీఫైనల్ వంటి నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించడం అనవసరం. ఇంతవరకు ఎలా ఆడి విజయం సాధిస్తూ వెళ్లామో, అలాగే వాంఖేడి స్టేడియంలో కూడా అడుగుపెట్టాం. టాస్ దగ్గర నుంచి మనకు కలిసి వచ్చింది. అలాగే మన ఫీల్డింగ్ వైఫల్యాలు వారికి కలిసొచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.