భారత క్రికెట్ కెప్టెన్‌గా ఎన్నో అపూర్వ విజయాలను అందించిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. దీపావళి పండుగ సందర్భంగా ధోని ఎంటర్‌టైన్‌మెంట్ (Dhoni Entertainment) పేరుతో సంస్థను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ధోని సతీమణి సాక్షి సింగ్ ధోని (Sakshi Singh Dhoni) మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నారు. ధోని సినిమాల వైపు ఆకర్షితుడు అవటమే కాదు.. సినీ రంగంలోకి అడుగు పెడతారని ఎక్కువ మంది ఊహించలేదు. అయితే క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీ వైపు దృష్టి సారించారు.
అసలు మహేంద్ర సింగ్ తన నిర్మాణ సంస్థ ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌లో ముందుగా ఏ సినిమాను నిర్మిస్తారనే దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. తమిళ సినిమాను నిర్మించబోతున్నారు. తొలి చిత్రానికి రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించబోతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ధోని సతీమణి సాక్షి (Sakshi Singh Dhoni) సింగ్ కథను అందించారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని ఈ సందర్బంగా వారు పేర్కొన్నారు.
ఉత్తరాది వాడైనప్పటికీ ధోనికి తమిళనాడుతో మంచి అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా ఐపీఎల్ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆయనే నాయకత్వం వహించాడు. అప్పటి నుంచి తమిళ ప్రజలు ధోనీని తలైవా అని పిలుస్తుంటారు. అదే అనుబంధం ఇప్పుడు ఆయన్ని తన బ్యానర్లో తొలి సినిమాగా తమిళంలో చేయటానికి అడుగులు వేయించి ఉండొచ్చు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేయబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే ఈ బ్యానర్ నుంచి వరుస సినిమాలు వస్తాయని కూడా వారు చెప్పారు.