Dream Coaching Staff: భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య తాజాగా ముగిసిన వన్డే సిరీస్ ని 2 – 1 తేడాతో కోల్పోయింది టీమిండియా. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మరోసారి తీవ్ర విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి. గౌతమ్ గంభీర్ తీసుకున్న చెత్త నిర్ణయాల వల్లే భారత్ ఓడిపోయిందని ఫైర్ అవుతున్నారు అభిమానులు. అంతేకాకుండా గౌతమ్ గంభీర్ కోచ్ గా నియామకం అయినప్పటినుండి ఇప్పటివరకు భారత్ 5 సిరీస్ లు కోల్పోయిందని తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
గౌతమ్ గంభీర్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న సమయం నుండి ఇప్పటివరకు విజయాల కంటే ఓటములే ఎక్కువగా ఉన్నాయని మండిపడుతున్నారు. 2024 కి ముందు వరుస విజయాలతో దూసుకు వెళ్లిన టీం ఇండియా.. ఆ తర్వాత నుంచి ఎందుకు వరుస ఓటములను చవిచూడాల్సి వస్తుందన్న కారణాలన్నీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపు చూపిస్తున్నాయి. 2024 వరకు బాగా ఆడిన జట్టు.. ఇప్పుడు ఇలా డీలా పరిపోవడానికి గల కారణాలపై అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. గతంలో రవి శాస్త్రి, రాహుల్ ద్రావిడ్ కోచ్ లుగా ఉన్నప్పుడు భారత్ కి ఎందుకు విజయాలు దక్కాయి..? ఇప్పుడెందుకు సక్సెస్ రేటు లేదు అనడానికి గౌతమ్ గంభీర్ కారణమనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.
కేవలం రాజకీయ కారణాలతోనే గంభీర్ ని హెడ్ కోచ్ గా నియమించారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. రవి శాస్త్రి, రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్న సమయంలో ఆటగాళ్లలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపేవారు అని.. సరిగ్గా ఆడని వాళ్లను పర్సనల్ గా తీసుకొని ట్రైన్ చేసేవారని కామెంట్స్ చేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. కానీ గంభీర్ మాత్రం అలా చేయడం లేదని అంటున్నారు. కేవలం ఆసియా కప్ 2025 టోర్నీ గెలిచినప్పటికీ.. భారత్ – శ్రీలంక వన్డే సిరీస్, స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ డ్రా, తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్.. ఈ ఓటములకు గల కారణాలు గంభీర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే భారత్ ఓడిపోయిందనే విమర్శలు వెలువడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్ ని ఒక్క వన్డేలో కూడా ఆడించలేదని.. హర్షిత్ రాణాని ప్రతి మ్యాచ్ లో ఆడించడంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.
సాధారణంగా జట్టు సెలక్షన్ సమావేశాలలో హెడ్ కోచ్ పాల్గొనకూడదు. కానీ గౌతమ్ గంభీర్ కి మాత్రం ఈ అవకాశాన్ని కల్పించింది బీసీసీఐ. కానీ గంభీర్ మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమయ్యాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక గంభీర్ ని మాత్రమే కాకుండా.. అతడి సపోర్టింగ్ స్టాఫ్ ని కూడా తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త స్టాఫ్ తో కూడిన కోచింగ్ యూనిట్ కి సంబంధించిన ఓ డిమాండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Gukesh Dommaraju: గుకేష్ మరో విజయం..ఈ సారి ప్రపంచ నంబర్ 2ను ఓడించాడు
ఇందులో మహేంద్ర సింగ్ ధోనీ ని హెడ్ కోచ్ గా నియమించాలని, బ్యాటింగ్ కోచ్ గా యువరాజ్ సింగ్, బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్, ఫీల్డింగ్ కోచ్ గా సురేష్ రైనా, స్పిన్ కన్సల్టెంట్ గా అనిల్ కుంబ్లే ని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు క్రీడాభిమానులు. పాత కోచింగ్ సిబ్బందిని తొలగించి.. వీరిని కోచ్ లుగా నియమిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. వీరిని నియమిస్తే ఇక టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.