Big Stories

ENG vs PAK : ముగిసిన పాకిస్తాన్ కథ.. ఇంగ్లాండ్ ఘన విజయం

ENG vs PAK

ENG vs PAK : వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ కథ ముగిసింది. సెమీస్ ముంగిట వారికి అదృష్టం కలిసి రాలేదు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో వర్షం వచ్చి గెలిచినట్టు ఇంకో అద్భుతం జరుగుతుందని అనుకున్నారు. కానీ అలాంటివేవీ జరగలేదు. ఒక లెక్క ప్రకారం పాక్ సెమీస్ చేరాలంటే… ఇంగ్లండ్ విధించిన 337 పరుగుల లక్ష్యాన్ని 6 ఓవర్లలోనే చేధించాలి. కానీ పాక్ 6 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసింది. అప్పుడే అధికారికంగా సెమీస్ రేస్ నుంచి పాక్ తప్పుకున్నట్టయ్యింది.

- Advertisement -

కాకపోతే ఇంగ్లండ్ కి మాత్రం చావుతప్పి కన్నులొట్టబోయింది. ఎట్టకేలకు పాక్ పై గెలిచి, పాయింట్ల పట్టికలో 7వ స్థానం నిలబెట్టుకుంది. 2024లో పాకిస్తాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా కోల్ కతాలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి 337 పరుగులు చేసింది. బదులుగా పాకిస్తాన్ 244 పరుగులకి ఆలౌట్ అయ్యింది. చివర్లో పాకిస్తాన్ టెయిల్ ఎండర్స్  9వ వికెట్ కి 53 పరుగుల పార్టనర్ షిప్ జోడించారు. కాసేపు మెరుపులు మెరిపించారు. కొంప దీసి వీరిద్దరూ కలిసి గెలిపిస్తారా? అనిపించారు. కానీ 244 పరుగుల వద్ద పాకిస్తాన్ కథ ముగిసిపోయింది.

- Advertisement -

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 337 పరుగులు చేసింది. లక్ష్యచేధనకు వచ్చిన పాకిస్తాన్ ఓపెనర్లు ఇద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. అబ్దుల్లా షఫీక్ డకౌట్ అయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫకార్ ఇమాన్ (1) ఘోరంగ విఫలమయ్యాడు. న్యూజిలాండ్ మీద చితక్కొట్టిన తనపై జట్టు మేనేజ్మెంట్, కెప్టెన్ బాబర్ పెట్టుకున్న ఆశలను వమ్ము చేసి పెవిలియన్ బాట పట్టాడు.

అప్పుడే పాక్ పతనం ఫిక్స్ అయిపోయింది. 2.3 ఓవర్లలో 10 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ బాబర్ ఆజామ్ (38) మమ అనిపించాడు. అప్పటికి 3 వికెట్ల నష్టానికి 61 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఇంక ఏ దశలోనూ పాకిస్తాన్ కోలు కోలేదు. మహ్మద్ రిజ్వాన్ (36), సయ్యద్ షకీల్ (29), సల్మాన్ ఆలి (51), ఇఫ్తికర్ అహ్మద్ (3), షదాబ్ ఖాన్ (3), షాహిన్ ఆఫ్రిది (25) ఏదో ఆడామంటే ఆడామన్నట్టు ఆడారు.

ఎంత త్వరగా పాకిస్తాన్ తిరిగి వెళ్లిపోదామా? అన్నట్టుగానే కనిపించారు. ఇలా 191 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో పాకిస్తాన్ టెయిల్ ఎండర్స్ ఇంగ్లండ్ కి వణుకు పుట్టించారు. ఒక టైమ్ లో మ్యాక్స్ వెల్ ని గుర్తుకు తెచ్చారు. హారిస్ రవూఫ్ (36), వసీమ్ జూనియర్ (16) ఇద్దరూ కలిసి 53 పరుగులు చేసి మ్యాచ్ ని గెలిపిస్తారన్న రేంజ్ లో ఆడారు. కానీ రవూఫ్ ఒక సిక్స్ ట్రై చేసి లాంగ్ ఆన్ లో దొరికిపోయాడు. అలా 244 పరుగుల వద్ద ప్రపంచకప్ లో పాకిస్తాన్ ప్రస్థానం ముగిసింది.
పాయింట్ల పట్టికలో 5 వస్థానం నిలబెట్టుకుని ఇంటి ముఖం పట్టింది. ఇంగ్లండ్ బౌలింగ్ లో  డేవిడ్ విల్లీ 3, ఆదిల్ రషీద్ 2, గస్ అట్కిన్సన్ 2, మొయిన్ ఆలి 2 , క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీసుకున్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ చాలా కాన్ఫిడెంట్ గా మొదలు పెట్టింది. ఇన్నాళ్లూ ఈ బ్యాటింగ్ అంతా ఎక్కడపెట్టారని అంతా అనుకున్నారు. పాకిస్తాన్ ని అంత ధీటుగా ఎదుర్కొన్నారు. అసలు సిసలు అంతర్జాతీయ ఆటగాళ్లులా ఆడారు. చివరికెలాగో మ్యాచ్ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించారు. గౌరవం కాపాడుకున్నారు. ఓపెనర్లు కాన్ఫిడెంట్ గానే మొదలు పెట్టారు. డేవిడ్ మలన్ (31) చేసి అవుట్ అయ్యారు. అప్పటికి ఇంగ్లండ్ 13.2 ఓవర్లలో 82 పరుగులు చేసింది. మరో ఓపెనర్ బెయిర్ స్టో (59), ఫస్ట్ డౌన్ జో రూట్ (60) కలిసి స్కోరు బోర్డుని పరుగులెత్తించారు. ఈ దశలో 108 పరుగుల వద్ద బెయిర్ స్టో అవుట్ అయ్యాడు.

సెకండ్ డౌన్ వచ్చిన బెన్ స్టోక్స్ (84) ఒక ఎండ్ లో నిలబడిపోయాడు. జాస్ బట్లర్ (27), హారీ బ్రూక్ (30), వీరితో కలిసి జట్టుని 300 పరుగులు దాటించాడు. ఇక చివర్లో డేవిడ్ విల్లీ 15 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లు రన్ రేట్ పెంచే క్రమంలో ఇలా వచ్చి అలా షాట్లు కొట్టి అవుట్ అయిపోయారు. మొతానికి వరల్డ్ కప్ మొత్తమ్మీద ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లండ్ గౌరవ ప్రదమైన స్కోరు 337 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఆఫ్రిది 2, రవూఫ్ 3, ఇఫ్తికర్ అహ్మద్ 1, వసీమ్ జూనియర్ 2 వికెట్లు తీసుకున్నారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ ఇంగ్లండ్ బౌలింగ్ ధాటికి 244 పరుగుల వద్ద ఆలౌట్ అయిపోయింది. దీంతో 93 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. మేం తప్పకుండా సెమీస్ కి వెళతామని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ టాస్ ఓడిన వెంటనే, వారి చివరి ఆశ  ఆరిపోయింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News