Big Stories

Dilshan Madushanka : మట్టిలో మాణిక్యం.. శ్రీలంక ఓడినా.. అతను గెలిచాడు..

Dilshan Madushanka

Dilshan Madushanka : శ్రీలంక అన్ని మ్యాచ్ ల్లో అధ్వాన ప్రదర్శన చేసి ఉండొచ్చు. పాయింట్ల పట్టికల్లో తొమ్మిదో స్థానంలో ఉండొచ్చు. వీరి అధ్వాన ప్రదర్శనకి శ్రీలంక క్రికెట్ బోర్డే రద్దయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఏకంగా ఐసీసీ సభ్యత్వాన్నే కోల్పోయి ఉండొచ్చు.. ఎంత జరిగినా ఇదంతా ఒక ఎత్తు.. ఆ 23 ఏళ్ల కుర్రాడు ఒక్కడూ ఒకెత్తుగా నిలిచాడు. ప్రస్తుతం ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ల ప్రశంసలు అందుకుంటున్నాడు.

- Advertisement -

 ప్రపంచకప్ 2023లో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా రికార్డ్ స్రష్టించాడు. 9 మ్యాచ్ లు ఆడి 21 వికెట్లు తీసుకుని ప్రస్తుతం వరల్డ్ కప్  2023లో నెంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు. అతనే దిల్షాన్ మధుశంక.. అయితే సెమీస్, ఫైనల్ మ్యాచ్ లు ఇంకా మిగిలి ఉన్నాయి. వీటిలో ఎవరైనా 21కన్నా ఎక్కువ తీసుకుంటే మాత్రం తను వెనుకపడతాడు. అయితే తనని దాటే వారు బాగానే ఉన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా నుంచి ఆడమ్ జంపా (19),  సౌతాఫ్రికా నుంచి ఇద్దరు గెరాల్డ్ కొయెట్జీ  (18), మార్కో జాన్సన్ (17), ఇండియా నుంచి మహ్మద్ షమీ (16) , న్యూజిలాండ్ శాంట్నర్ (16) , జస్పిత్ బుమ్రా (15) వీరున్నారు. అయితే వీరంతా సెమీస్, అదృష్టం బాగుంటే ఫైనల్ కూడా ఆడతారు.

- Advertisement -

అందువల్ల మధుశంక (21) దాటవచ్చు. కానీ వీళ్లందరికి 10, 11 మ్యాచ్ లు అవసరమయ్యాయి. కానీ మధుశంక మాత్రం 9 మ్యాచ్ ల్లోనే  21 వికెట్లు తీసుకోవడం విశేషం. ఒకరకంగా చెప్పాలంటే శ్రీలంక క్రికెట్ కి దొరికిన ఒక ఆణిముత్యం అని చెప్పాలి. మళ్లీ శ్రీలంక ఐసీసీ సభ్యత్వం పొంది ఎప్పటిలా క్రికెట్ ఆడితే భవిష్యత్ ఆశాకిరణమనే చెప్పాలి.

దిల్షాన్ మధుశంకది ఒక స్ఫూర్తిమంతమైన కథ. ఎంతోమందికి ఇన్సిపిరేషన్. ఎందుకంటే తను కడు పేదరికం నుంచి వచ్చాడు. క్రికెట్ ఆడేందుకు అవసరమైన డబ్బులు ఉండేవి కావు. తండ్రి ఒక జాలరి. రోజూ ఆయన సంపాదించేది ఇల్లు గడవడానికే సరిపోయేది కాదు. ఇంక ఆటలకి ఎలా ఇవ్వగలడు. ఈ పరిస్థితుల్లో క్రికెట్ పై ఎంతో ప్రేమ ఉన్న మధుశంక, డబ్బులు తక్కువయ్యే సాఫ్ట్ బాల్ క్రికెట్ వైపు మొగ్గు చూపాడు.

అక్కడ కూడా తన ప్రతిభను చూపించాడు. మధుశంక ఆట తీరుని గమనించిన ఓ కోచ్ తనని అండర్ 19 జట్టుకి నెట్ బౌలర్ గా తీసుకెళ్లాడు. అప్పుడా సెషన్స్ కి వెళ్లడానికి షూస్ కూడా ఉండేవి కావు. దాంతో ఫ్రెండ్స్ ని అడిగి వెళ్లేవాడు. అది మనసుకెంతో కష్టంగా ఉన్నా లక్ష్యం సాగే క్రమంలో వాటన్నింటిని అధిగమించాడు.

అక్కడ శ్రీలంక దిగ్గజ పేసర్ చమిందా వాస్ దృష్టిలో పడ్డాడు. తను మధుశంకలో అంతర్జాతీయ బౌలర్ కి కావల్సిన లక్షణాలు ఉన్నాయని గ్రహించాడు. ప్రోత్సహించాడు. తగిన శిక్షణ ఇచ్చాడు. అంతేకాదు జాతీయ జట్టుకి ఎంపిక కావడంలో తనవంతు ప్రయత్నం చేశాడు.  అలా ఆఫ్గనిస్తాన్ లో జరిగిన టీ 20 సిరీస్ కి ఎంపికయ్యాడు. ఇక అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు.

ప్రపంచకప్ కి కూడా లక్కీగా ఎంపికయ్యాడు, మెయిన్ బౌలర్ చమీరకు గాయం కావడంతో తను మెగా టోర్నీలో ఆడేందుకు ఇండియా ఫ్లైట్ ఎక్కాడు. ఇక్కడ అద్భుతంగా ప్రదర్శన చేసి 9 మ్యాచ్ ల్లో 21 వికెట్లు తీసి టాప్ బౌలర్ గా నిలిచాడు. ఇండియాతో ఆడిన శ్రీలంక 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ మ్యాచ్ లో ఇండియన్ బ్యాట్స్ మెన్ ని ఐదుగురిని మధుశంక అవుట్ చేశాడు.

ఇలా మొత్తానికి శ్రీలంక టీమ్ అంతా ఫెయిలైనా మధుశంక ఒక్కడు మాత్రం గెలిచాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News