Rohit Sharma : క్రికెట్ లో ఎప్పుడెలా జరుగుతుందో ఎవరికీ తెలీదు. గెలిచే మ్యాచ్ లు ఓడిపోతుంటారు. ఓడే మ్యాచ్ లు గెలుస్తుంటారు. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో తనతో సహా కొందరు బ్యాటర్స్ అనవసరపు షాట్లు కొట్టి అవుట్ అయిపోయారని కెప్టెన్ రోహిత్ శర్మ అనడం సంచలనం సృష్టిస్తోంది. ఇండియా జట్టుని విమర్శిస్తున్న వారికి సపోర్ట్ ఇచ్చినట్టయ్యింది.
లక్నో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటూ రోహిత్ శర్మ అన్నమాటలు వైరల్ అవుతున్నాయి. తను ఏమన్నాడంటే.. ఇంకో 30 పరుగులు చేసి ఉంటే బాగుండేదని అనిపించింది. ఎందుకంటే ఈ పిచ్ మీద ఆ మాత్రం స్కోర్ ఉంటే, పోరాడవచ్చు, కానీ బౌలర్లు ఆ శ్రమ లేకుండా చేశారు.
షమీ, బూమ్రా ఇద్దరూ ఇంగ్లండ్ బ్యాటర్లని ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు. అంతేకాదు ఏ ఇద్దరు పార్టనర్ షిప్స్ ని బిల్డ్ అవకుండా చూశారు. ఇది మా బౌలర్ల విజయం అని తేల్చిచెప్పాడు.
ఇలా అంటూనే మావాళ్లు, అంటే నాతో సహా అందరం అనవసరపు షాట్లు కొట్టి అవుట్ అయ్యాం. ఇలా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే వెనుక ఇంకా బ్యాటర్స్ ఉన్నారంటే పర్వాలేదు. ఒకవైపు మ్యాచ్ లో చూస్తే… లోస్కోరు నడుస్తోంది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో అవసరం లేకపోయినా షాట్లు ఆడి వికెట్లు పారేసుకోవడం తెలివైన నిర్ణయం కాదని తెలిపాడు.
ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కోహ్లీ లను ఉద్దేశించి ఈ మాటలన్నట్టు అందరికీ అర్థమైంది. అయితే తను కూడా అనవసరపు షాట్ కొట్టి సెంచరీ చేజార్చుకున్నానని తెలిపాడు. ఏం జరిగినా 100 పరుగుల తేడాతో విజయం సాధించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని అన్నాడు. జట్టు బ్యాటర్స్ స్కోరు చేయలేనప్పుడు బౌలింగ్ విభాగం చెలరేగి ఆడటం జట్టుకి శుభపరిణామమని అన్నాడు.
జట్టులోని ప్రతి ఆటగాడికి కఠిన పరీక్ష పెట్టిన మ్యాచ్ ఇది అని తెలిపాడు. ఇంతవరకు గెలిచిన అన్ని మ్యాచ్ లు ఛేజింగ్ లో నెగ్గినవే. వరల్డ్ కప్ 2023 లో ఇదే తొలిసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసి, గెలవడమని అన్నాడు. ఇప్పుడు జట్టు సమతూకంగా ఉంది. అన్ని విభాగాల్లో అందరూ రాణిస్తున్నారని ప్రపంచానికి అర్థమైందని అన్నాడు. లైన్ అండ్ లెంగ్త్ కి కట్టుబడి మనవాళ్లు బౌలింగ్ చేశారని కొనియాడాడు.
స్వింగ్ తో పాటు పిచ్ నుంచి కూడా సహకారం లభించిందని అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ బ్యాట్స్ మెన్ అయినా పరుగులు తీయడానికి ఇబ్బంది పడతాడని అన్నాడు. అదే ఇంగ్లండ్ జట్టుకి ఎదురైంది…అందుకే పరుగులు చేయక తప్పని పరిస్థితుల్లో అవుట్ అయ్యారని అన్నాడు. లక్ష్యం మరీ తక్కువగా ఉన్నప్పుడు బౌలర్ల మీద ఒత్తిడి ఉంటుంది. దానిని ఈరోజు మనవాళ్లు సమర్థవంతంగా అధిగమించారని రోహిత్ సంతోషం వ్యక్తం చేశాడు.