Delhi Liquor Scam : ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో రద్దుచేసిన ఎక్సైజ్ పాలసీలో అవినీతి, మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారంటూ మనీష్ సిసోడియాపై అభియోగాలు రాగా.. ఆయన్ను సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం మనీష్ తరఫు లాయర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సోమవారం సిసోడియా బెయిల్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. దానిని కొట్టివేసింది. సిసోడియాకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది.
ఈ కేసు విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. విచారణ నెమ్మదిగా సాగితే మాత్రం.. సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గతంలో సిసోడియా బెయిల్ కోసం వేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్ వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. బెయిల్ మంజూరుపై తీర్పును అక్టోబర్ 17న రిజర్వ్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని సవరించేందుకు సిసోడియా లంచం ఇచ్చినట్లు రుజువు చేయడం కష్టమని అక్టోబర్ 17న ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. లంచం ఇచ్చారన్న అంచనాతో ముందుకు వెళ్లలేమన్న ధర్మాసనం.. చట్టప్రకారం విచారణ జరగాలని ఫెడరల్ ఏజెన్సీకి తెలిపింది. తాజాగా సిసోడియా బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ.. సుప్రీం షాకిచ్చింది.
సీబీఐ తనను అరెస్ట్ చేయడంతో.. ఫిబ్రవరి 28న మనీష్ సిసోడియా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బెయిల్ కు అప్లై చేయగా.. మంత్రిగా పనిచేసిన సిసోడియా అత్యున్నత స్థాయి వ్యక్తి అని, ఆయన సాక్ష్యులను ప్రభావం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ.. మే 30న ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. మరోసారి పిటిషన్ వేయగా.. సిసోడియాపై ఈ స్కామ్ లో తీవ్రమైన అభియోగాలున్నాయని చెబుతూ.. జులై 3న కూడా బెయిల్ రిజెక్ట్ అయింది.
ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 17, 2021న ఈ విధానాన్ని అమలు చేసింది. అయితే అవినీతి ఆరోపణల కారణంగా సెప్టెంబర్ 2022 చివరిలో దానిని రద్దు చేసింది. దర్యాప్తు సంస్థలు తెలిపిన దాని ప్రకారం.. కొత్త విధానం ప్రకారం టోకు వ్యాపారుల లాభాల మార్జిన్లను ఐదు నుండి 12 శాతానికి పెంచారు. కొత్త విధానం కార్టలైజేషన్‌కు దారితీసిందని, మద్యం లైసెన్స్‌లకు అనర్హులు ద్రవ్య ప్రయోజనాల కోసం మొగ్గు చూపారని ఏజెన్సీలు ఆరోపించగా, ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, మనీష్ సిసోడియా ఎటువంటి తప్పు చేయలేదని ఖండించారు.