
Asia Cup : వన్డే ప్రపంచ కప్ కు ముందు ఆసక్తికర టోర్నికి రంగ సిద్ధమైంది. బుధవారం ఆసియా కప్ లో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నిలో ఆరు జట్లు తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో ముల్తాన్ వేదికగా నేపాల్ తో పాకిస్థాన్ తలపడుతుంది.చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి.
పాకిస్థాన్, శ్రీలంక ఆసియాకప్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. టీమిండియా ఆడే మ్యాచలన్నీ శ్రీలంకలోనే జరుగుతాయి. ప్రపంచ కప్‌లో ఆడే 5 జట్లు ఈ టోర్నీలో ఆడుతున్నాయి. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు భారత్, పాక్ ,లంకకు సవాల్ విసురనున్నాయి. ఈ టోర్నీలో తొలిసారిగా నేపాల్ బరిలోకి దిగుతుంది.
రౌండ్ రాబిన్ విధానంలో ఆసియా కప్ జరుగుతుంది. ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ పోటీ పడుతున్నాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఆయా గ్రూపుల నుంచి సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సూపర్-4లో టాప్-2 లో నిలిచిన జట్లు ఫైనల్ కు వెళతాయి. ఈ టోర్నీలో దయాది పాకిస్థాన్ జట్టుతో కనీసం రెండు సార్లు టీమిండియా తలపడుతుంది.
ఇప్పటివరకు 15 ఆసియాకప్‌లు జరిగాయి. అందులో 13 వన్డే ఫార్మాట్లోనే నిర్వహించారు రెండు సార్లు మాత్రమే టీ20 ఫార్మాట్ లో జరిగాయి. ఆసియాకప్ ను భారత్ ఏడుసార్లు కైవసం చేసుకుంది. 1984, 1988, 1990, 1995, 2010, 2016-టీ20, 2018లో టీమిండియా విజేతగా నిలిచింది. ఆసియా కప్ లో టీమిండియా 49 వన్డేల్లో 31 గెలిచింది.
శనివారం భారత్ , పాకిస్థాన్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియాకప్‌లో ఇరుజట్లు 13 సార్లు తలపడ్డాయి. ఏడు సార్లు భారత్ జట్టు గెలిచింది. 5 సార్లు పాక్ విజయం సాధించింది.