
PV Sindhu at French Open 2023 : డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్ వరకు వెళ్లి అక్కడ ఓటమి పాలైన సింధూ మళ్లీ కొత్తగా ఫ్రెంచ్ ఓపెన్ లో పాల్గొంది.గతంలో జరిగిన ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఎప్పటిలా నూతనోత్సాహంతో ఆటలో పాల్గొని శుభారంభం చేసింది.
తొలి మ్యాచ్ లో 7వ సీడ్ ఇండోనేషియా షట్లర్ గ్రెగోరియా మరిస్క పై 12-21, 21-18, 21-15 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి గేమ్ లో పట్టు కోల్పోయిన సింధు మొదటి రౌండ్ లోనే ఇంటికి తిరిగి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ పట్టుదలగా, మొండి ధైర్యంతో ఆడి ముందంజ వేసింది. తర్వాత రెండో సెట్ ను హోరాహోరీగా పోరాడి గండం గట్టెక్కంది. నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో ప్రత్యర్థిని 15 పాయింట్ల వద్దే నిలువరించి విజయం సాధించింది. రెండో రౌండ్ లోకి ప్రవేశించింది.
అయితే మొదటి మ్యాచ్ లోనే చెమటోడ్చిన గెలిచిన సింధు తర్వాత మ్యాచ్ ల్లో ఎంతవరకు ప్రత్యర్థులను నిలువరించగలదోనని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇండియా తరఫు నుంచి ఈ మాత్రమైనా వెళ్లి ప్రాతినిథ్యం వహించడం గొప్పేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయుల్లో ఒక్కరైనా ప్రతిష్టాత్మకమైన టైటిల్స్ కొట్టగలిగే వారున్నారా? అలా చూస్తే సింధు ఎంతో బెస్ట్ అని కొందరు కితాబునిస్తున్నారు.
పురుషుల డబుల్స్ లో భారత స్టార్ జంట సాత్విక్-చిరాగ్ శెట్టి కూడా విజయం సాధించింది. తొలి రౌండ్ లో వీరు 21-13, 21-13 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు. ఫ్రాన్స్ కు చెందిన లుకాస్ కొర్వీ, రొనాస్ లాబార్ పై గెలుపొందారు.కేవలం 35 నిమిషాల్లోనే వీరిద్దరు విజయం సాధించడం విశేషం.
ఉమెన్స్ డబుల్స్ లో రుతపర్ణ పాండా, శ్వేతపర్ణ పాండా జోడి మాత్రం నిరాశపరించింది. తొలిరౌండ్ లో వీరిద్దరూ 6-21, 16-21 తేడాతో చైనాకు చెందిన జోడీ చేతిలో ఓటమి పాలయ్యారు. టోర్నీ నుంచి నిష్క్రమించారు.