
Skin Cancer Treating Soap : శ్రమ నీ ఆయుధమైతే.. విజయం నీ బానిస అవుతుంది అన్నారు పెద్దలు. అందుకు వయసుతో పని లేదు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద విజయాలు సాధిస్తూ.. విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభను, సత్తాను చాటుతున్నారు. అమెరికాకు చెందిన ఈ బాలుడు కూడా 14 ఏళ్ల వయసులోనే.. వైద్యులు కూడా చేయలేని పనిచేశాడు. స్కిన్ క్యాన్సర్ తో బాధపడేవారికి ఉపశమనమిచ్చేలా.. అందరికీ అందుబాటు ధరలో ఉండేలా ఒక సబ్బును తయారు చేశాడు.
ఫెయిర్ ఫాక్స్ కౌంటీలోని ఫ్రాస్ట్ మిడిల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న14 ఏళ్ల హేమన్ బెకెలే.. ఈ ఏడాది 3ఎం యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. ఈ ఛాలెంజ్ లో హేమన్ తో పాటు మరో తొమ్మిది మంది విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేయగా.. విజేతగా నిలిచి.. 25 వేల డాలర్ల ప్రైజ్ అందుకున్నాడని, అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్ గా పేరుపొందాడని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. 9వ తరగతి చదువుతున్న హేమన్.. తయారు చేసిన ఈ సబ్బు ధర 10 డాలర్లలోపే ఉంటుంది. ఇది చర్మాన్ని రక్షించే కణాలను తిరిగి సక్రియం చేసే పదార్థాలను కలిగి ఉండటంతో పాటు.. స్కిన్ క్యాన్సర్ కు కారణమయ్యే కణాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. స్కిన్ క్యాన్సర్ ను నివారించే సబ్బును తయారు చేసేందుకు తాను పడిన కష్టం ఫలించిందని హేమన్ సంతోషం వ్యక్తం చేశాడు.
తాను ఇథియోపియాలో నివసిస్తున్నపుడు నిత్యం ఎండలో పనిచేసిన వారిని చూసినపుడు ఈ ఆలోచన వచ్చిందని తెలిపాడు. తొలుత దానిని పెద్దగా పట్టించుకోలేదని.. ఆ తర్వాత 3ఎం యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్ పోటీల తేదీ దగ్గరపడుతున్నపుడు ఆ విషయం గుర్తొంచిందన్నాడు. స్కిన్ క్యాన్సర్ పై తన పరిశోధనను మొదలుపెట్టాడు. సైన్స్ పరంగానే కాకుండా.. వీలైనంత ఎక్కువ మందికి తాను తయారు చేసే సబ్బు అందుబాటులో ఉండేలా చేయాలనుకున్నానని తెలిపాడు. అలాగే ఇది అత్యంత సౌకర్యవంతంగా, నమ్మదగినదిగా కూడా ఉండాలని భావించాడు.

ఈ పోటీల్లో హేమన్.. టాప్ 10 లిస్టులోకి ఎంటరయ్యాక.. 3M ప్రొడక్ట్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ అయిన డెబోరా ఇసాబెల్లె అనే మెంటార్‌తో జతకట్టాడు. హేమన్ చాలా యుక్తవయసులోనే.. ప్రపంచంలో స్కిన్ క్యాన్సర్ ను తగ్గించడంపై దృష్టి పెట్టడంలో అతనేంటో తెలిసిందని ఇసాబెల్లె తెలిపింది. “క్రియాత్మకంగా ఉండే సమ్మేళనాల సమ్మేళనాన్ని కలిగి ఉన్న నమూనాను అభివృద్ధి చేయడానికి అనేక నెలల ప్రయోగాలు అవసరం. హేమన్ కంప్యూటర్ మోడలింగ్‌ని ఉపయోగించి ఛాంపియన్‌షిప్‌లో ప్రదర్శించబోయే సబ్బు నమూనా కోసం సూత్రాన్ని రూపొందించాడు. స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్ సోప్ అని పేరు పెట్టాం. డెన్డ్రిటిక్ కణాలను పునరుద్ధరించడంలో సహాయపడే సమ్మేళనాన్ని ఉపయోగించడం ద్వారా ఈ సబ్బు పనిచేస్తుంది. డెన్డ్రిటిక్ కణాలు పునరుద్ధరించబడిన తర్వాత,అవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.” అని ఇసాబెల్లె వివరించారు.
స్కిన్ క్యాన్సర్ ను నివారించేందుకు మార్కెట్లో చాలా క్రీమ్స్ ఉన్నా.. ఇంతవరకూ సబ్బు అందుబాటులోకి రాలేదని హేమన్ తెలిపాడు. ప్రజెంటేషన్ ప్యానెల్ లో.. చర్మ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే ఈ సబ్బు అందరికీ అందుబాటులో ఉండే చిహ్నంగా మార్చాలనుకుంటున్నట్లు చెప్పానని హేమన్ వెల్లడించాడు. ఏదేమైనా ఇంత చిన్న వయసులో హేమన్ గొప్ప విజయాన్నే సాధించాడని చెప్పాలి.