Glenn Maxwell: ఐపీఎల్ 2025 సీజన్ లో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ అదరగొడుతుంది. ఇప్పటివరకు పంజాబ్ ఆడిన 4 మ్యాచ్లలో.. మూడు మ్యాచ్లలో విజయం సాధించింది. దీంతో పంజాబ్ ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ ఐపిఎల్ 2025లో భాగంగా మంగళవారం రోజు పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్ మొహాలీలో జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ బ్యాటర్లు ప్రియాంశ్ ఆర్య 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో {103} పరుగులు చేశాడు. ఇక శశాంక్ సింగ్ 52 పరుగులు చేశాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ {PBKS} నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
ఇక చెన్నై బౌలర్లలో ఖలీద్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య చేదనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. చెన్నై బ్యాటర్లలో కాన్వే 69, రచిన్ రవీంద్ర 36, శివమ్ దూబె 42, మహేంద్ర సింగ్ ధోనీ 27 పరుగులతో రాణించారు. ఇక పంజాబ్ బౌలర్లలో ఫెర్గుసన్ 2, గ్లేన్ మ్యాక్స్ వెల్, యష్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే ఈ సీజన్ లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మాక్స్వెల్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు.
ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నై తో జరిగిన మ్యాచ్ లో ఆరవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన మ్యాక్స్వెల్.. రెండు బంతులు ఎదుర్కొని అశ్విన్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ బౌలింగ్ లో మాత్రం కాస్త రాణిస్తున్నాడు. రచిన్ రవీంద్ర రూపంలో కీలక వికెట్ తీసి పంజాబ్ విజయంలో మాక్స్వెల్ తన వంతు పాత్ర పోషించాడు. అయితే తాజాగా మాక్స్వెల్ కి ఐపీఎల్ పాలకమండలి షాక్ ఇచ్చింది.
అతడి మ్యాచ్ ఫీజులో 25% మేర కోత విధించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అనుచిత ప్రవర్తనకు గాను ఈ మేర జరిమానా విధించింది. “ఐపీఎల్ ప్రవర్తన నియమావళి లోని ఆర్టికల్ 2.2 లో గల లెవెల్ వన్ తప్పిదానికి పాల్పడ్డాడు మ్యాక్స్వెల్. ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు. నిబంధనల ప్రకారం అతడి మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నాం” అని ఐపిఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.
అదేవిధంగా మ్యాక్స్వెల్ ఖాతాలో ఓ డీ మెరిట్ పాయింట్ ని జత చేసింది. అయితే ఏ ఘటనలో అతడికి ఈ జరిమానా విధించారన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, గ్రౌండ్ పరికరాలు లేదా డ్రెస్సింగ్ రూమ్ తలుపులు, అద్దాలు, ఫిట్టింగులకు నష్టం కలిగించే చర్యలు ఈ నిబంధనలోకి వస్తాయి. కాగా 4 డి మెరిట్ పాయింట్లకు ఒక మ్యాచ్ నిషేధం ఉండనుంది.