
Hardhik Pandya : టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా.. అక్టోబర్ 19న పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచ్ లో గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయం కారణంగా.. వరల్డ్ కప్ 2023 నుంచి మధ్యలోనే నిష్క్రమించిన హార్థిక్.. ఇంకా కోలుకోలేదు. గాయం కారణంగానే త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లకు కూడా దూరం కానున్నాడని తెలుస్తోంది. నవంబర్ 23న విశాఖ వేదికగా ప్రారంభమయ్యే T20I సిరీస్‌తో పాటు.. డిసెంబర్ లో దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ మ్యాచ్ కు కూడా హార్థిక్ దూరంగానే ఉంటాడని సమాచారం.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కథనం ప్రకారం.. చీలమండ గాయం కారణంగా పాండ్యా కనీసం మరో రెండు నెలల పాటు క్రికెట్ కు దూరంగానే ఉంటాడని తెలుస్తోంది. బలమైన గాయం అవడంతో.. పాండ్యా స్థానంలో మొహమ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. గాయం తీవ్రతను బట్టి శస్త్రచికిత్స కూడా చేయవచ్చని తెలుస్తోంది.
బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో.. హార్థిక్ పాండ్యా బంతిని ఆపేందుకు ప్రయత్నించినపుడు గాయపడ్డాడు. అక్టోబరు 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ కు పాండ్యా దూరంగా ఉండగా.. నవంబర్ 4న అతను ప్రపంచకప్ నుంచి నిష్క్రమించినట్లు అధికారికంగా నిర్థారణ అయింది. హార్దిక్ ఆస్ట్రేలియా T20Iల సమయంలో పునరాగమనం చేసి జట్టుకు నాయకత్వం వహిస్తాడని భావించారు. కానీ ఇప్పుడు అతను వచ్చే ఏడాది వరకు ఆడే అవకాశం లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ఈ సంవత్సరం ఆటను బట్టి ఫార్మాట్ చూస్తే.. హార్దిక్‌కు డిప్యూటీగా పనిచేసిన సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత కెప్టెన్‌గా రేసులో ముందున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు జట్టుకు నాయకత్వం వహించాడు. కాగా.. నవంబర్ 23న విశాఖలో ఇండియా – ఆసీస్ ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుండగా.. 26న తిరువనంతపురం, 28న గౌహతి, డిసెంబర్ 1న నాగపూర్, డిసెంబర్ 3న వరుసగా టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత.. దక్షిణాఫ్రికాతో ఆ దేశంలోనే డిసెంబర్ 10, 12, 14 తేదీల్లో మూడు టీ 20 మ్యాచ్ లు, ఆ తర్వాత 2 టెస్ట్ మ్యాచ్ లు, 3 వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి.