
Hamas-Hostage : హమాస్ మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్న వారి ఫొటోలు, వీడియోలు ఇజ్రాయెల్ సైన్యం చేతికి చిక్కాయి. గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అల్-షిఫాలో తనిఖీల సందర్భంగా ఇవి బయటపడ్డాయి. బందీల ఫొటోలు, వీడియోలున్న లాప్‌టాప్‌లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) కంటపడ్డాయి.
ఆస్పత్రులను హమాస్ తమ అడ్డాలుగా చేసుకుందంటూ ఐడీఎఫ్ తొలి నుంచీ చెబుతోంది. దానికి బలం చేకూరుస్తూ అల్-షిఫా, రంతిసి పిల్లల ఆస్పత్రుల కింద సొరంగాలను మిలిటెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆస్పత్రుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా బయటపడ్డాయి.
తాజాగా బందీల ఫొటోలున్న లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఐడీఎఫ్ స్వాధీనం చేసుకుంది. లాప్‌టాప్‌లు, కంప్యూటర్లలో సమాచారాన్ని ఛేదించే పనిలో బలగాలు ఉన్నాయి. దీంతో బందీల గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని ఐడీఎఫ్ భావిస్తోంది.

షిషా ఆస్పత్రికి సమీపంలోని భవనంలో ఓ బందీ మృతదేహాన్ని ఐడీఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఆ మృతదేహం యెహుదిత్ వీస్‌ది(65)గా గుర్తించారు. గత నెల 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 1200 మందిని ఊచకోత కోయగా.. 240 మందిని బందీలుగా పట్టుకున్నారు.
అల్-షిఫా ఆస్పత్రిలో బందీలను ఉంచినట్టు బలమైన ఆధారాలు లభించాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. బలగాల ఆపరేషన్ ఆరంభం కాగానే.. అక్కడి సొరంగం నుంచి వేరొక చోటుకి తరలించారని పేర్కొంది.