HCA: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ జరుగుతున్న క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ – హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం తలెత్తిందని మార్చ్ 30 తెల్లవారుజామున క్రికెట్ ప్రేమికులు నిద్ర లేవగానే ఓ లేఖ సోషల్ మీడియాలలో వైరల్ గా మారింది. ఉచిత పాస్ ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ {హెచ్సీఏ} తమను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని, ఇలా అయితే తాము హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతామని సన్రైజర్స్ హైదరాబాద్ హెచ్చరించింది.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మొదటి మ్యాచ్ లోనే ఫైన్ ?
ఈ మేరకు హెచ్సీఏ కోశాధికారి.. ఎస్ఆర్హెచ్ ప్రతినిధికి లేఖ రాశారు. తాము కోరినన్ని పాస్ లు ఇవ్వనందున ఇటీవల కార్పొరేట్ బాక్స్ కి తాళాలు వేసిన విషయాన్ని లేఖలో సన్రైజర్స్ బయటపెట్టింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదని, మ్యాచ్ మొదలయ్యే సమయంలో ఇలా బ్లాక్ మెయిల్ చేయడం అన్యాయమని లేఖలో పేర్కొంది. ఇలాంటి పరిస్థితులలో సమన్వయంతో పనిచేయడం కష్టమని, దీనిని సంఘం దృష్టికి కూడా తీసుకువెళ్తామని లేఖ లో పేర్కొన్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ నగరాన్ని తాము విడిచి వెళ్లిపోతామని దీని సారాంశం. అయితే ఈ లేఖ బయటకు వచ్చి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ, అందులో ఉన్న విషయాలలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యాలయం.
సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అధికారిక ఈమెయిల్స్ నుండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారిక ఈమెయిల్ కి ఎలాంటి మెయిల్స్ రాలేదని పేర్కొంది. కొన్ని వెబ్సైట్ లలో ప్రచారం అవుతున్న వార్తలలో వాస్తవం లేదని కొట్టిపడేసింది. ఒకవేళ నిజంగానే ఈమెయిల్స్ వచ్చి ఉంటే.. ఆ సమాచారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లేదా సన్రైజర్స్ హైదరాబాద్ అధికారిక ఈమెయిల్ నుండి కాకుండా గుర్తుతెలియని ఈ మెయిల్స్ నుండి లీక్ చేయడం వెనుక ఉన్న కుట్ర ఏంటి..? అని ప్రశ్నించింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ – సన్రైజర్స్ హైదరాబాద్ ప్రతిష్టను మసకబార్చేందుకు కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపింది. ఈమెయిల్స్ నకిలీవా..? నిజమైనవా..? తెలుసుకోవడానికి సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి కూడా మీడియా స్పష్టమైన వివరణ తీసుకోవాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కి – హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి మధ్య ఎటువంటి వివాదాలు లేవని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ రూమర్స్ పట్ల ఆందోళనకు గురైన అభిమానులు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ని ప్రచారం చేయడం ఏంటని మండిపడుతున్నారు అభిమానులు.