
Aaqib Javed : 1996లో తాము వరల్డ్ కప్ లో ఓడిపోయి పాకిస్తాన్ వెళితే ప్రజలు కోడిగుడ్లతో, కుళ్లిన టమాటాలతో కొట్టారని పాకిస్తాన్ మాజీ ఆటగాడు అకీబ్ జావెద్ గుర్తు చేశాడు. నాడు ఎయిర్ పోర్టు దగ్గర బస్సు ఎక్కేటప్పుడు ప్రజలు చాలా ఆగ్రహంతో కనిపించారని తెలిపాడు. ఆరోజు బెంగళూరు వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ లో ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఎయిర్ పోర్టులో దిగగానే ఆరోజు జరిగిన చేదు అనుభవాన్ని వివరించాడు.
“మావాళ్లందరూ బస్ ఎక్కేశారు. నేను వెళ్లేలోపు బస్సు వెళ్లిపోయింది. బ్యాగ్ తో పరిగెడుతున్నా.. ఇంతలో కుళ్లిన టమాటాలు, కోడిగుడ్లు బస్సు మీద పడుతుంటే డ్రైవర్ స్పీడ్ గా లాగించేశాడు. నేను దొరికిపోయాను. అప్పుడు అందరి దృష్టి నా మీద పడింది. అవన్నీ నామీద వేయడం మొదలుపెట్టారు. ఇంతలో సినిమాల్లో చూపించినట్టు రయ్ మని ఒక జీప్ వచ్చి, నా ముందు ఆగింది. నన్ను బలవంతంగా అందులోకి ఎక్కించారు. నేను చాలా కంగారుపడ్డాను. నా పని అయిపోయిందని అనుకున్నాను.
వీళ్లు ఎక్కడికో ఊరవతలకి తీసుకెళ్లి నన్ను కుళ్ల బొడిచేయడం లేదా మళ్లీ క్రికెట్ ఆడకుండా కాలో చేయో తీసేయడం ఖాయమని హడలిపోయాను. తీరా చూస్తే ఆ జీవులో ఉన్నది నా కజిన్. నన్ను నా టెన్షన్ చూసి నవ్వుతున్నాడు. అయితే అతను పోలీస్. విషయం ముందే తెలిసి ఎందుకైనా మంచిదని ఎయిర్ పోర్టుకి వచ్చాడు. లక్కీగా ఆందోళనకారులకి దొరక్కుండా తప్పించాడు. అయితే అప్పటికే నాకు జరగాల్సిన సన్మానం జరిగిపోయింది.
అక్కడ తప్పించుకున్నా.. ఇంటికెళ్లాక కూడా మమ్మల్ని వదల్లేదు. మా ఇంటిని తగలబెట్టాలని చూశారు. ఇప్పటిలా అప్పుడంత పోలీసు భద్రత లేదు. ఎస్కార్ట్స్ లేరు. అందరికీ పాక్ ప్రజల చేతిలో అవమానం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్లు అదృష్టవంతులు. ఇంత ఘోరంగా ఓడిపోయినా సరే, ఎంతో అపురూపంగా ఎయిర్ పోర్టు దగ్గర నుంచి ఫుల్ సెక్యూరిటీతో తీసుకెళ్లారు. ఎవరిళ్ల దగ్గర వారిని భద్రంగా దిగబెట్టారు.” అక్కడ కూడా భారీ బందోబస్సు ఏర్పాటు చేశారని జావేద్ తన ఆక్రోశాన్ని వెళ్ల గక్కాడు.