Aniket Verma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 18 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతుంది. వైజాగ్ ని తన రెండవ మైదానంగా ఎంచుకున్న ఢిల్లీ.. ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ విజయాలతో భళా అనిపించింది. ఆదివారం ఆ జట్టు ఏడు వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ని చిత్తు చేసింది. బ్యాటింగ్ పై అతిగా ఆధారపడ్డ సన్రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఈ మ్యాచ్ చేజారింది.
Also Read: MS Dhoni – Riyan Parag: బుడ్డోడు కాస్త.. ఐపీఎల్ హీరో అయ్యాడు… సక్సెస్ అంటే ఇదే
కానీ ఈ ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ కి మరో కొత్త హీటర్ దొరికేశాడు. ట్రావీస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హార్డ్ హిటర్లు ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నుండి మరో కొత్త హీరో పుట్టుకొచ్చాడు. ఎంతో అనుభవజ్ఞులైన స్టార్లు విఫలమైన చోట.. ఈ కుర్ర బ్యాటర్ మెరుపులు మెరిపించాడు. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ 37 పరుగుల వద్ద నాలుగు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆ సమయంలో హైదరాబాద్ జట్టుని ఓ కుర్ర బ్యాటర్ ఆదుకున్నాడు. భారీ సిక్సర్లతో హడలెత్తించాడు. 41 బంతులలో 74 పరుగులు చేశాడు. అతడే {Aniket Verma} అనికేత్ వర్మ. ఆరవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన ఆనికేత్ వర్మ.. ప్రత్యర్థి బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరడంతో ఇక సన్రైజర్స్ 100 పరుగుల లోపే కుప్పకూలేలా కనిపించింది. కానీ ఆ సమయంలో 23 ఏళ్ల ఈ అనికేత్ వర్మ సంచలన ప్రదర్శన చేశాడు.
అనికేత్ వర్మ {Aniket Verma} సాయంతో హైదరాబాద్ జట్టు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఇతడిని ఐపీఎల్ 2025 మెగా వేలంలో 30 లక్షలకు హైదరాబాద్ దక్కించుకుంది. కానీ ఈ మ్యాచ్ లో వర్మ అంతకు పదిరెట్ల ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్ తోనే ఐపిఎల్ లో డెబ్యూ చేసిన అనికేత్.. భారీ షాట్లతో అదరగొడుతున్నాడు. 23 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు ఐపీఎల్ కి ముందు దేశవాళీల్లో 3 టీ-20 లు మాత్రమే ఆడి 43 పరుగులు చేశాడు.
ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేయని అనికేత్.. గత సంవత్సరం అండర్ 23 టోర్నీలో కర్ణాటక పై మధ్యప్రదేశ్ తరఫున 75 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. ఇందులో కూడా 8 సిక్సర్లు బాదాడు. దీనికి ముందు మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ {ఎంపీఎల్} లో కూడా ఆరు ఇన్నింగ్స్ లలో 273 పరుగులు చేశాడు. ఓ మ్యాచ్ లో 32 బంతుల్లోనే సెంచరీ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు.. ఇతడు పవర్ హిటింగ్ కి పెట్టింది పేరని. ఇక ఈ లీగ్ లో ఇప్పటికే 25 సిక్సర్లు దంచాడు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఇతడి మెరుపులు చూసిన హైదరాబాద్ ఫ్రాంచెంజి.. ట్రయల్ కి పిలిపించింది. అందులో 13 బంతులలోనే 36 పరుగులు చేశాడు. ఇతడు మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు.