Tonga Earthquake: వరుస భూకంపాలతో ఆసియా ఖండంలోని పలు దీవులు, దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇటివల మయన్మార్, థాయ్‌లాండ్ ప్రాంతాల్లో భూకంపం సృష్టించిన విధ్వంసాన్ని మరువక ముందే మరోసారి భూమి కంపించింది. ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఇక నిన్న రాత్రి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న టోంగా దీవుల్లో భూకంపం వచ్చింది.
దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. టోంగాలోని పంగై గ్రామానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ALSO READ: థాయ్‌లాండ్‌లో భూకంపం
భూకంపం నుంచి పూర్తిగా తేరుకోక ముందే అక్కడి ప్రజలకు అధికారులు మరో భయంకరమైన వార్త చెప్పారు. భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం టోంగా అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. నియు, టోంగా తీరాల్లో అలల స్థాయి 0.3 మీటర్ల నుంచి 1 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని టోంగా వాతావరణ శాఖ హెచ్చరించింది.
సునామీ హెచ్చరికల నేపథ్యం టోంగా తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు లేదా తీర ప్రాంతానికి దూరంగా వెళ్లాలన్నారు. ఈ ద్వీప దేశంలో లక్ష మంది వరకు జనాభా ఉంది.