Big Stories

HYD vs TN Highlights: హైదరాబాద్‌ తొండాట

HYD vs TN Highlights: రంజీ ట్రోఫీలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొండాట ఆడింది. కావాలనే బంతి బంతికీ ఎక్కువ సమయాన్ని వృథా చేసి… తమిళనాడు విజయావకాశాల్ని దెబ్బతీసింది. హైదరాబాద్ జట్టు ఆటతీరు చూసినవాళ్లు… జెంటిల్మెన్ గేమ్ కే చెడ్డపేరు తీసుకొచ్చారని మండిపడుతున్నారు.

- Advertisement -

రెండో ఇన్నింగ్స్ లో హైదరాబాద్ 258 పరుగులకు ఆలౌట్ కావడంతో… తమిళనాడు ముందు 11 ఓవర్లలో 144 పరుగుల లక్ష్యం నిలిచింది. అంటే గెలవడానికి ఓవర్‌కు 13 పరుగులుపైగా చేయాలి. మామూలుగా రంజీ ట్రోఫీలో ఇలాంటి కష్టసాధ్యమైన లక్ష్యం ఉంటే… రెండు జట్ల కెప్టెన్లు మ్యాచ్ డ్రా చేసుకుంటారు. కానీ… తమిళనాడు మాత్రం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది. ఆ జట్టు వీరోచిత బ్యాటింగ్ చేస్తుంటే… హైదరాబాద్ మాత్రం మైదానంలో అత్యంత దారుణంగా ప్రవర్తించింది.

- Advertisement -

తమిళనాడు ఇన్నింగ్స్ సందర్భంగా హైదరాబాద్ వ్యూహాత్మకంగా సమయం వృథా చేసింది. ఫీల్డర్లందరూ బౌండరీ లైన్ దగ్గరే నిలబడగా… లాంగాఫ్‌లో నిలబడ్డ కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌… బంతి బంతికీ బౌలర్‌ దగ్గరికి వచ్చి సూచనలు ఇస్తూ పోయాడు. చివరికి సిక్సర్లు కొట్టిన బంతుల్ని బౌలర్ కు ఇవ్వడంలోనూ హైదరాబాద్‌ ఫీల్డర్లు బాగా ఆలస్యం చేస్తుండటంతో… తమిళనాడు ఆటగాళ్లే స్టాండ్స్‌లో వెళ్లి బంతులు అందించారు. ఓవైపు హైదరాబాద్ ఆటగాళ్లు విసిగించే ఆటతీరు ప్రదర్శించినా… తమిళనాడు బ్యాటర్లు మాత్రం ధాటిగా ఆడారు. 7 ఓవర్లలోనే వికెట్‌ నష్టానికి 108 పరుగులు చేశారు. ఎన్‌.జగదీశన్‌ 22 బంతుల్లోనే 59 పరుగులు చేయగా, సాయి సుదర్శన్‌ 20 బంతుల్లో 42 రన్స్ బాదాడు. ఇక 24 బంతుల్లో 36 పరుగులు మాత్రమే చేయాల్సిన దశలో… తమిళనాడు కచ్చితంగా గెలుస్తుందని అపించింది. కానీ, హైదరాబాద్ ఆటగాళ్లు వెలుతురు మందగించిందని అంపైర్ల దృష్టికి తీసుకొచ్చారు. రీడింగ్ చూసిన అంపైర్లు… వెలుతురు తగ్గిందంటూ మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్‌ డ్రా కావడంతో… తమిళనాడు బ్యాటర్లు నిరాశగా వెనుదిరిగారు. ఓటమి నుంచి తప్పించుకోవాలంటే వెలుతురు తగ్గేదాకా మ్యాచ్ సాగదీయాలనుకున్న హైదరాబాద్… అనుకున్నట్టే సమయం వృథా చేసి మ్యాచ్ డ్రాగా ముగించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News