
India vs New Zealand : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో ఇప్పటికే కివీస్‌ను రోహిత్ సేన మట్టికరిపించింది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో సెమీస్ బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇంతకన్నా ఎక్కువ ఉత్సాహంతో కివీస్ కూడా ఉంది.
నాకౌట్ మ్యాచ్ ల్లో ఎప్పుడూ కూడా టీమ్ ఇండియాకి కాలిలో ముల్లులా న్యూజిలాండ్ అడ్డుపడుతూనే ఉంది. పోనీ వెళ్లి కప్పు అయినా కొడుతుందా? అంటే అదీ లేదు. వెళ్లి ఫైనల్ లో బొక్కబోర్లా పడుతుంది. క్రికెట్ ఆడే టాప్ ఎనిమిది దేశాల్లో ఇంతవరకు వన్డే ప్రపంచకప్ కొట్టని ఏకైక టీమ్ న్యూజిలాండ్ మాత్రమే.
క్రికెట్ ఆడే టాప్ 8 దేశాలలో ఆరు జట్లు ఒక్కసారైనా ప్రపంచకప్ ను ముద్దాడాయి. కివీస్ కి మాత్రం దురదృష్టం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆఖరికి క్రికెట్ కి పుట్టిల్లు అయిన ఇంగ్లండ్ కూడా 2019 వరకు కప్ కొట్టలేదు. అలా కివీస్ కి బాధలు చెప్పుకోడానికి ఒక తోడైనా ఉండేది. ఇప్పుడది కూడా లేదు.
ఒకరకంగా న్యూజిలాండ్ దేశానికి, జట్టుకి ఏమైనా అసంత్రప్తి ఉందంటే ఇదొక్కటే అని చెప్పాలి. 2015, 2019 లో ఫైనల్ వరకు వెళ్లి ఓటమి పాలైంది. 2011లో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ లో ఓడి ఇంటి దారి పట్టింది. వరుసగా మూడు ప్రపంచకప్ ల నుంచి ఆ జట్టు పోరాటపటిమను తప్పనిసరిగా ప్రస్తావించాల్సిందే.
కెప్టెన్ కేన్ విలయమ్సన్ ఆ జట్టుకి అదనపు బలం. అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్ ను ఈ సారి ఎలాగైనా సాధించాలని, భారత్ ను ఓడించి ఫైనల్ లోకి అడుగు పెట్టాలని కివీస్ పట్టుదలగా ఉంది. భారత్ విషయానికి వస్తే 1983, 2011లో వరల్డ్ కప్ సాధించింది. 2003లో ఫైనల్ వరకు వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఇకపోతే సెమీస్ కి ఇప్పటివరకు 7సార్లు చేరుకున్న ఇండియా మూడుసార్లు విజయం సాధించింది. నాలుగు సార్లు ఇంటి దారి పట్టింది. ఇప్పటికే ఇరు జట్లు ముంబై చేరుకున్నాయి. మహాయుద్ధానికి ఇక ఒక రోజు మాత్రమే ఉంది.