Kohli Fan Reaction: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం రోజు దుబాయ్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్ లో గెలిచి ఊపుమీదున్న టీమిండియా.. అదే ఊపును కంటిన్యూ చేస్తూ రెండవ మ్యాచ్ లో పాకిస్తాన్ పై కూడా గెలుపొంది సెమీస్ బెర్త్ ని కన్ఫామ్ చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి టోర్నీలో సజీవంగా నిలవాలని ఆశించిన దాయాది పాకిస్తాన్ కి నిరాశ ఎదురైంది.
ఈ ఓటమితో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ బ్యాటర్లు.. సౌద్ షకీల్ 76 బంతులలో 62, కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ 77 బంతులలో 46 పరుగులు చేయడంతో ఓ మోస్తరు టార్గెట్ ని నిర్దేశించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2, హర్షిత్ రానా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 111 బంతులలో వంద పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
దీంతో పాకిస్తాన్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 42.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. కోహ్లీ తో పాటు శ్రేయస్ అయ్యర్ 67 బంతులలో 56 పరుగులు, గిల్ 52 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. ఇప్పటివరకు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లలో ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు విరాట్ కోహ్లీ. 2012లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 183 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ స్కోర్. ఇక 2015 వరల్డ్ కప్ లోను అదే దూకుడు చూపించాడు.
2009 నుండి 2023 వరకు పాకిస్తాన్ తో 16 మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ 678 పరుగులు చేశాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా అదే ఊపిరి కంటిన్యూ చేస్తూ సెంచరీతో అజయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ ని విరాట్ కోహ్లీ ఫోర్ తో ముగించడంతో అటు భారత్ గెలుపు, ఇటు విరాట్ కోహ్లీ సెంచరీ కూడా పూర్తయ్యాయి. దీంతో మ్యాచ్ చూడడానికి వచ్చిన భారత అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇక టీవీలలో మ్యాచ్ చూసిన అభిమానుల సంబరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే భారత్ గెలుపొందిన నేపథ్యంలో ఓ అభిమాని చేసుకున్న సంబరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంట్లో కుటుంబంతో కలిసి మ్యాచ్ తిలకించిన అభిమాని.. ఏకంగా తన షర్ట్ ని విప్పేసి అటు ఇటు పరిగెత్తుతూ, ఆ తర్వాత శాష్టాంగ నమస్కారం చేస్తూ ఎంజాయ్ చేశాడు. అలా చేస్తున్న అతడిని కుటుంబ సభ్యులు చూస్తూ షాక్ కి గురయ్యారు. దీంతో ఈ అభిమాని చేసుకున్న సంబరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు భారత్ పై ఓటమితో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. పాకిస్తాన్ జట్టుపై చాలా ఆశలు పెట్టుకున్నామని, పేలవ ప్రదర్శనతో జట్టు ఓటమిపాలైందని మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీని కట్టడి చేయడంలో విఫలమయ్యారని మండిపడుతున్నారు.
A fan's reaction on Virat Kohli's hundred Vs Pakistan. 🤣🔥pic.twitter.com/xoLFKy9DG6
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2025