Speaker on Sakshi: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు మరిన్ని కష్టాలు పెరుగుతున్నాయా? జగన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? వైసీపీ పత్రికకు రేపో మాపో ప్రభుత్వం నోటీసులు ఇవ్వనుందా? అవుననే సంకేతాలు బలంగా వినినిపిస్తున్నాయి. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.
మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడేందుకు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య నిలబడ్డారు. తొలుత ఆయన సాక్షి ప్రచురించిన పలు కథనాలను శాసనసభ దృష్టికి తెచ్చారు. పేపర్ కంటింగులను సభలో ప్రదర్శించారు. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికపై విచారణ జరిపేందుకు ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
అసలు కథేంటి?
ఫిబ్రవరి 22న సాక్షి పేపర్ ఓ కథనాన్ని ప్రచురించింది. ‘కోట్లు ఖర్చు.. శిక్షణ తుస్సు’ అనే పేరిట ఓ కథనాన్ని వెల్లడించింది. దాని సారాంశం ఏంటంటే.. ప్రణాళిక లేకుండా ఎమ్మెల్యేల శిక్షణ తరగతుల ప్రకటన అని రాసుకొచ్చింది. అంతేకాదు లోక్‌సభ స్పీకర్ నానడంతో చివరి నిమిషంలో వాయిదా వేశారని పేర్కొంది. అప్పటికే సగం ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, దీనివల్ల ప్రజాధనం వృథా అంటూ తాటికాయంత అక్షరాలతో పేర్కొంది.
ఎమ్మెల్యేల శిక్షణా తరగతులపై సాక్షిలో వచ్చిన కథనంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. సాక్షిపై విచారణ జరిపేందుకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తున్నట్టు వెల్లడించారు. సభా హక్కుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. చట్ట సభలపై ఏ మాత్రం గౌరవం లేకుండా సాక్షిలో ఇలాంటి కథనాలు రావడం బాధాకరమన్నారు.
ALSO READ: గుండు కొట్టించింది మీరు కాదా-మంత్రి లోకేష్ ఫైర్
ఆ కథనాలను నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి తప్పుడు రాతలకు ముగింపు పలకాలన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ఆ పత్రికపై తదుపరి చర్యలు ఉంటాయని చెప్పకనే చెప్పారు స్పీకర్.
సాక్షి వ్యవహారాలను తనకు ఏ మాత్రం సంబంధం లేదని పలుమార్లు చెప్పారు జగన్. ఎన్నికల ప్రచారంలో తనకు పత్రిక, ఛానెల్ లేదని వెల్లడించారు. ఈ వ్యవహారంలో సభాహక్కుల కమిటీ నివేదిక కీలకం కానుంది. నోటీసులిస్తే ఆ పత్రిక యాజమాన్యం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. తొలి తప్పు అని చెప్పి తప్పించుకుంటుందా? చర్యలు తీసుకోవాలని ఆ కమిటీ సిఫార్సు చేస్తుందా? అనేది చూడాలి.