ICC Rankings : ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ తాజాగా విడుదల చేసింది. భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ నెంబర్ వన్ స్థానంలో ఉన్న ట్రావీస్ హెడ్ ను అధిగమించి టీ-20ల్లో నెంబర్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. వెస్టిండీస్ తో జరిగిన టీ-20సిరీస్ ఆడకపోవడంతో ట్రావిస్ హెడ్ ఒక స్థానం దిగజారి రెండో స్థానానికి పడిపోయాడు. అభిషేక్ కెరీర్ ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. అంతేకాదు.. వన్డే, టెస్ట్, టీ-20 మూడు ఫార్మాట్లలో భారత ఆటగాళ్లు ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. అభిషేక్ తో పాటు శుబ్ మన్ గిల్ వన్డేల్లో నెంబర్ వన్ బ్యాట్స్ మన్ గా కొనసాగుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ బౌలర్లలో నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. అదే సమయంలో టెస్ట్ ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. టీ-20 ఆల్ రౌండర్లలో నెంబర్ వన్ గా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు.
Also Read : Ind vs Eng 5th test : ఇంగ్లాండ్ కి షాక్.. ఓవల్ టెస్ట్ నుంచి తప్పుకున్న కెప్టెన్ స్టోక్స్..!
బ్యాటింగ్ లో అభిషేక్ నెంబర్ వన్
జట్టు ర్యాంకింగ్స్‌లో వన్డేలు, టీ20ల్లో భారత జట్టు నెంబర్ వన్‌గా కొనసాగుతున్నది. అభిషేక్ ప్రస్తుతం 829 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. ట్రావిస్ హెడ్ 814 రేటింగ్ పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 17 టీ20 మ్యాచులు ఆడి 33.44 సగటు 193.85 స్ట్రయిక్ రేట్‌తో 535 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మరో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్ చేసి ఆరు వికెట్లు పడగొట్టాడు. విధ్వంసక ఓపెనర్‌గా గుర్తింపు పొందిన అభిషేక్.. టీ20ల్లో కీలక ఆటగాడిగా మారాడు. అదే సమయంలో ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్లలో రెండవ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌కు చెందిన మెహదీ హసన్ మీరాజ్ కంటే.. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 117 రేటింగ్ పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.
ఆల్ రౌండర్లలో జడేజా నెంబర్ వన్
ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా నెంబర్ వన్‌గా ఉన్నాడని తెలిపింది. 422 పాయింట్లతో బంగ్లాదేశ్‌కు చెందిన మెహదీ హసన్ మిరాజ్ కంటే 117 పాయింట్లు ముందంజలో ఉన్నాడు. జడేజా ఐదు స్థానాలు ఎగబాకి బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లో 29వ స్థానానికి, బౌలర్లలో ఒక స్థానం 14వ స్థానానికి చేరుకున్నాడు. టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో వాషింగ్టన్ సుందర్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 65వ స్థానానికి చేరుకున్నాడు. మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్‌లో జడేజాతో కలిసి ఐదవ వికెట్‌కు 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. సుందర్ ఎనిమిది స్థానాలు ఎగబాకి ఆల్ రౌండర్ల జాబితాలో 13వ స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇక టెస్టుల్లో జో రూట్ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతుండగా.. న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ మూడో స్థానంలో ఉన్నాడు.