
ICC Worldcup 2023 : ఐసిసి వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చి అగ్ర స్థానాన్ని చేరుకుంది. మొదటి మ్యాచ్ నుండి తన ఆధిపత్యాన్ని కొనసాగించిన టీమ్ ఇండియా.. ప్రత్యర్థి జట్టు ఏదైనా చిత్తు చేస్తూ ఫైనల్స్‌కు చేరుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పురుషుల వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇక, ఫైనల్ మ్యాచ్‌కు గుజరాత్‌లోని నరేంద్రమోడీ స్టేడియం ఆతిధ్యమిస్తూ ఉండగా.. భారత వాయు దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని గుజరాత్ డిఫెన్స్ పీఆర్ఓ ఇప్పటికే వెల్లడించారు.
నవంబర్ 19న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు ముందు పది నిమిషాల పాటు సూర్యకిరణ్ టీమ్ ఈ ప్రదర్శన ఇవ్వనున్నారు. అహ్మదాబాద్ మొటెరాలోని నరేంద్ర మోడీ స్టేడియం వద్ద శుక్ర, శనివారాల్లో ఎయిర్ షోకు సంబంధించిన రిహార్సల్స్ కూడా నిర్వహిస్తున్నారు. నింగిలో నిర్వహించే ఈ ఎయిర్ షోలో విజయానికి గుర్తుగా చేసే లూప్ విన్యాసాలు, బారెల్ రోల్ విన్యాసాలు, ఆకాశంలో వివిధ ఆకృతులను రూపొందించడం వంటివి భాగంగా ఉంటాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించేందుకు వస్తున్న లక్షా 20 వేల మంది క్రికెట్ అభిమానులు సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ ప్రదర్శనను స్టేడియం లోపల నుండి ఆస్వాదించనున్నారు.
సూర్య కిరణ్ అనేది భారత వైమానిక దళానికి చెందిన ఏరోబాటిక్స్ ప్రదర్శన బృందం. సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ 1996లో ఏర్పడింది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన 52వ స్క్వాడ్రన్‌లో భాగంగా ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన ఈ బృందం తమ ప్రదర్శనల కోసం సాధారణంగా తొమ్మిది విమానాలను వినియోగిస్తుంది.
ఇక, భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఐసిసి ప్రపంచ కప్ 2023 ఫైనల్‌కు భారత ప్రధాని గౌరవ అతిథిగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగే ఈ ఫైనల్‌కు ప్రధాని మోదీతో పాటు ఎంఎస్ ధోనీ కూడా హాజరుకానున్నారు. కాగా.. ఫైనల్ మ్యాచ్ కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ప్రఖ్యాత గాయకులు దూప లిపా, ప్రీతమ్ చక్రవర్తి, ఆదిత్య గాధవి వంటి ప్రముఖ కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు.