Ind vs Nz: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన భారత జట్టు సెమీస్ కి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక చివరి లీగ్ మ్యాచ్ కి సిద్ధమైంది టీమ్ ఇండియా. నేడు దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ – ఏ లో టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీఫైనల్ కి అర్హత సాధించడంతో ఈ మ్యాచ్ నామ మాత్రమే అయినప్పటికీ.. గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు ఇరుజట్లు పోటీ పడబోతున్నాయి.
అంతేకాకుండా రానున్న సెమి ఫైనల్ మ్యాచ్ కి దీనిని రిహార్సల్ గా ఉపయోగించుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అలాగే ఇరుజట్లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఇప్పటికే సెమీస్ బెర్త్ దక్కించుకోవడంతో.. బెంచ్ ఆటగాళ్లకు ఈ మ్యాచ్లో అవకాశం ఇవ్వాలనే వ్యూహాలని రచిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి విశ్రాంతి కల్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు.
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా షమీ గాయం కారణంగా కాస్త ఇబ్బంది పడడంతో.. అతడికి ఈ మ్యాచ్ లో విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ దీనిపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అలాగే ఓడిన జట్టు దక్షిణాఫ్రికా తో తలపడుతుంది. అంటే ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే సెమీస్ లో ఆస్ట్రేలియా తో పోటీపడుతుంది. ఒకవేళ ఓడిపోతే సెమిస్ లో దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంటుంది. గ్రూప్-బి లో సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలిచింది.
భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్-ఏ లో టాప్ ప్లేస్ కి చేరుతుంది. ఆ జట్టు గ్రూప్ బి లో రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తో సెమిస్ లో తలపడుతుంది. ఇక గ్రూప్ ఏ లో రెండవ స్థానంలో ఉన్న జట్టు.. గ్రూప్ బి లో అగ్రస్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికాతో సెమిస్ లో పోటీ పడుతుంది. ఫామ్ లో ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ గ్రూప్ దశ చివరి పోరు ఆసక్తికరంగా మారింది.
ఈ మ్యాచ్ తో సెమీస్ ప్రత్యర్ధులు ఎవరో తేలనుండడంతో ఉత్కంఠ పెరిగింది. ఛాంపియన్ ట్రోఫీ 2025 సెమీస్ మార్చ్ 4, 5 తేదీలలో జరగనున్నాయి. ఇక నేడు భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 నెట్వర్క్ టీవీ చానల్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక జియో హాట్ స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.