CM Revanth Reddy: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. తొలుత ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించే అవకాశముంది. ఈ ఘటన సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోనున్నారు. ఈ క్రమంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఆ రేంజ్ ఐజీ సత్యనారాయణ.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్తున్నారు. వనపర్తి పర్యటన ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు రానున్నారు. ప్రమాదం ఘటన జరిగిన చోటుకు వెళ్లే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కోసం కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.
SLBC టన్నెల్ వద్ద ఆపరేషన్ తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఆదివారం ఏ క్షణమైనా గల్లంతైన వారిలో పలువురు ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జీపీఆర్ రాడార్ డేటా, మార్కింగ్ వద్ద తవ్వకాలు తుది దశకు చేరుకున్నాయి. కొంతమంది ఆచూకీ లభించే అవకాశం ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
ఆచూకీ లభిస్తే తదుపరి తీసుకోవాల్సి చర్యలకు సంసిద్ధంగా అధికార యంత్రాంగం ఉంది. దోమలపెంట వద్ద అందుబాటులో క్రిటికల్ కేర్ అంబులెన్సులు ఉంచారు. రెస్క్యూ ఆపరేషన్‌లో షిఫ్ట్‌కు 120 మంది సిబ్బంది పని చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది.
ALSO READ: ఒక్కరోజే 100 పైగా మెగా మెడికల్ క్యాంప్స్
ఏం జరిగింది?
ఫిబ్రవరి 22న ఉదయం 8.30 గంటల సమయంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘోర ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటన సమయంలో అక్కడ ఎనిమిది కార్మికులు ఉన్నారు. అయతే ఘటన తర్వాత సొరంగం లోకి నీరు, బురద చేరుకుంది. దీంతో సహాయక చర్యలు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
NDRF, SDRF, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ రెస్క్యూ టీమ్‌లు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. తొలి రోజు నుంచి టన్నెల్ నుంచి పైపుల ద్వారా నీటిని, బురదను డబ్బాల ద్వారా బయటకు పంపారు. ఆ తర్వాత టన్నెల్ లోపలికి సిబ్బంది వెళ్లారు. అయినా ఆచూకీ దొరకడం కష్టంగా మారింది.
ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. టెక్నాలజీ సాయంతో మృతదేహాలను గుర్తించాయి రెస్క్యూ టీమ్‌లు. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాల అవశేషాలను గుర్తించారు. ఈ క్షణంలోనైనా ఆదివారం వారిని బయటకు తీసే అవకాశమున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
వనపర్తికి సీఎం రేవంత్‌రెడ్డి
ఆదివారం వనపర్తి జిల్లాకు వెళ్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ టూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ. 721 కోట్ల విలువైన పనులకు భూమి పూజ చేయనున్నారు. తొలుత శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం సందర్శించనున్నారు. దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం, వనపర్తి ఐటీ టవర్స్, నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అలాగే పెబ్బేరు 30పడకల హాస్పటల్ నిర్మాణ పనులు, ప్రభుత్వ ZPHS, జూనియర్ కళాశాల వివిధ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
రాజానగరం టూ పెద మందాడి బీటీ రోడ్స్, వనపర్తి నియోజకవర్గంలో సీఆర్ఆర్ రోడ్స్, కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఇందిరమ్మ మహిళా శక్తి రేవంతన్న భరోసా పథకం ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లబ్దిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ చేస్తారు. లోన్ మేళా ద్వారా లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది.