IND VS PAK U19 Asia Cup 2026 Final: అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s U19 Asia Cup 2026) విజేతగా అందరూ ఊహించినట్టుగానే టీమిండియా జూనియర్ జట్టు నిలిచింది. గ్రూప్ స్టేజ్ లోనే పాకిస్తాన్ చేతిలో చిత్తయిన టీమిండియా, ఫైనల్ లో మాత్రం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ విధించిన 337 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి బంతి వరకు పోరాడిన టీమిండియా, ఒకే ఒక వికెట్ తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. ఈ తరుణంలోనే మ్యాచ్ గెలిచి 9వ సారి ఛాంపియన్ గా నిలిచింది భారత్. దీంతో టీమిండియా ప్లేయర్లు సంబరాలు చేసుకుంటున్నారు.
అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ లో ( ACC Men’s U19 Asia Cup 2026) భాగంగా ఒమన్ వేదికగా టీమిండియా, పాకిస్తాన్ (Pakistan U19 vs India U19, Final) జట్లు తలపడ్డాయి. అయితే, ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన అండర్ 19 పాకిస్తాన టీమ్, 50 ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది. పాకిస్తాన్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ 111 బంతుల్లో 107 పరుగులు చేసి ఊచకోత కోశాడు. మూడో స్థానంలో వచ్చిన అబ్దుల్ ఖదీర్ 80 పరుగులు చేయగా, కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 63 పరుగులతో రాణించాడు.
ఈ దెబ్బకు పాకిస్తాన్ భారీ స్కోర్ సాధించింది. ఇక ఛేజింగ్ కు దిగిన జూనియర్ భారత్ ఆరంభంలో అదరగొట్టింది. 95 పరుగుల వరకు వికెట్ పడకుండా రాణించింది. కానీ వీరూ భాయ్ కొడుకు ఆర్యవీర్ అర్థసెంచరీ కాగానే ఔట్ అయ్యాడు. అటు కెప్టెన్ లక్ష్య రాజేశ్ 80 పరుగులతో పోరాడే ప్రయత్నం చేయగా అనవసర షాట్ ఆడి, క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాను మళ్లీ మనల్ చౌహాన్ (47), మోహిత్ ఉల్వా (49) పరుగులు చేసి ఆదుకున్నారు. చివరి బంతికి మూడు పరుగులు రావాల్సి ఉండగా, మోహిత్ ఉల్వా బౌండరీ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. దీంతో 9వ సారి టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది.