India Tour Of Newzealand : T20 వరల్డ్ కప్ ఓటమి బాధ నుంచి తేరుకుంటున్న టీమిండియా… న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమైంది. నవంబర్ 18 నుంచి… అంటే మరో 3 రోజుల్లో కివీస్ గడ్డపై భారత జట్లు T20, వన్డే సిరీస్‌ల వేట మొదలుపెడతాయి. T20 వరల్డ్ కప్ లో సెమీస్ మినహా అద్భుతంగా ఆడిన న్యూజిలాండ్ ను… వారి సొంతగొడ్డపైనే ఓడించడం అంటే… భారత కుర్రాళ్లకు పెద్ద సవాలే అంటున్నారు… విశ్లేషకులు.
కివీస్ టూర్లో T20 జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనుండగా… వన్డే జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తాడు. న్యూజిలాండ్ పర్యటన నుంచి సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన బీసీసీఐ… యువ బౌలర్లు ఉమ్రాన్ మలిక్, కుల్‌దీప్ సేన్‌కు ఛాన్స్ ఇచ్చింది.
భారత్-న్యూజిలాండ్ మధ్య నవంబర్ 18న వెల్లింగ్టన్ లో తొలి T20 జరగనుండగా… నవంబర్ 20న మౌంట్ మాంగనుయ్‌లో రెండో T20 మ్యాచ్, నవంబర్ 22న నేపియర్‌లో మూడో T20 మ్యాచ్ జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతాయి. ఇక వన్డే సిరీస్ లో మొదటి వన్డే నవంబర్ 25న ఆక్లాండ్ లో జరగనుండగా… రెండో వన్డే నవంబర్ 27న హమిల్టన్ లో, మూడో వన్డే నవంబర్ 30న క్రైస్ట్ చర్చ్ లో జరగనున్నాయి. మూడు వన్డేలూ… భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకే మొదలవుతాయి. ఇక అన్ని మ్యాచ్ లను DD స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా… ప్రముఖ OTT యాప్ అమెజాన్ ప్రైమ్ లో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
భారత T20 జట్టులో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా… వైస్ కెప్టెన్ బాధ్యతల్ని రిషభ్ పంత్ చూసుకుంటాడు. జట్టులో సూర్య కుమార్ యాదవ్‌తో పాటు… శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.
ఇక భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా శిఖర్ ధావన్ ఉండగా… వైస్ కెప్టెన్సీ బాధ్యతల్ని రిషభ్ పంత్‌కు అప్పగించారు. ఈ జట్టులోనూ సూర్య కుమార్ యాదవ్‌తో పాటు… శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ ఉండగా… T20 జట్టులో లేని శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్‌దీప్ సేన్, షాబాజ్ అహ్మద్‌లకు వన్డే జట్టులో చోటు దక్కింది.