
India vs New Zealand Match : టీమ్ ఇండియా ఫైనల్ కు చేరింది. అంతవరకు సంతోషమే. కాదంటే చాలా మంది అనేమాటేమిటంటే, మనవాళ్లు మంచో చెడో ముందూ వెనుక చూడకుండా ఫటాఫట్ మని దొరికిన బాల్ ని దొరికినట్టు చితక్కొట్టేయడంతో కివీస్ పై 397 పరుగుల భారీ స్కోరు చేసింది. అవి అక్కడ ఉన్నాయి కాబట్టి, కివీస్ ఓటమి పాలయ్యింది గానీ, ఆ స్కోరే గానీ లేకుండా, ఓ 30 నుంచి 40 పరుగులు తక్కువ చేసి ఉంటే పరిస్థితెలా ఉండేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంటే పరిస్థితిని ఇంత దూరం తెచ్చారని పరోక్షంగా దెప్పి పొడుస్తున్నారు.
అంటే టీమ్ ఇండియా 350 పరుగులు మాత్రమే చేసి ఉంటే కివీస్ నుంచి మ్యాచ్ ని కాపాడుకోగలమా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే చేసి ఉంటే కచ్చితంగా కివీస్ బ్యాట్స్ మెన్ రిస్క్ షాట్లకు వెళ్లకుండా జాగ్రత్తగా ఆడేవారేనని అంటున్నారు. అంటే గెలుపు ఓటములను డిసైడ్ చేయలేకపోయినా డారెల్ మిచెల్ కి బాల్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఎలా అడ్డదిడ్డంగా ఆడినా సిక్స్ లు వెళుతున్నాయి.
మరోవైపు ఫిలిప్స్ కూడా నెమ్మదించేవాడు. తర్వాత పరమ డేంజరస్ బ్యాటర్ అయిన మార్క్ చాప్ మన్ కూడా కంగారుపడేవాడు కాదు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే రేపు ఫైనల్ లో కూడా ఇంతే స్కోరు చేయగలిగితేనే బౌలర్లకి వెసులుబాటుగా ఉంటుంది. ఊపిరి తీసుకుంటారు. ఈరోజున ప్రపంచ క్రికెట్ లో షమీ, బుమ్రా, సిరాజ్ లాంటి పేస్ బలం.. ఏ దేశానికి లేదని అంటున్నారు. ఒక్కరు మాత్రమే బాగా చేస్తున్నారు. మిగిలినవాళ్లు సపోర్టుగా మాత్రమే ఉంటున్నారు. కానీ టీమ్ ఇండియాలో అలా కాదు. ముగ్గురికి ముగ్గురూ నువ్వా నేనా అన్నట్టు బౌలింగ్ చేస్తున్నారు.
అంతటి పెద్ద బౌలింగ్ బలం ఉండి కూడా కివీస్ దగ్గర తేలిపోయినట్టే కనిపించింది. 327 పరుగుల వరకు లాక్కొచ్చినట్టయ్యింది. అనే విమర్శలకు ఎవరి దగ్గరా సమాధానం కనిపించడం లేదు. కానీ ఇక్కడందరూ గుర్తించాల్సిన ప్రధానమైన లోపం ఒకటుంది.
ఐదుగురి బౌలర్లలో నలుగురికి 42.5 ఓవర్ల వరకు వికెట్టే పడలేదు. అది కూడా ఫిలిప్స్ రూపంలో బుమ్రాకి వచ్చింది.
అప్పటివరకు పడిన నాలుగు వికెట్లు కూడా షమీ ఖాతాలోనే ఉన్నాయి. అంటే అక్కడ పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోండి. ఒకవేళ షమీ లేకపోతే సిన్మా మామూలుగా ఉండేది కాదు.
అందుకని ముగ్గురు పేసర్లలో ఇద్దరు మైనస్ అయిపోతే షమీ నేనున్నానంటూ ముందుకు వస్తున్నాడు. రేపు ఫైనల్ లో కూడా షమీ, కోహ్లీ, రోహిత్, శ్రేయాస్, గిల్ అందరూ ఎప్పటిలా రాణించి దేశానికి ప్రపంచకప్ తీసుకురావాలని కోరుతున్నారు.