
INDIA vs NEWZEALAND Semi Final : అది 2019 సంవత్సరం..
ఇంగ్లండ్ లోని మ్యాంచెస్టర్ ..
ఓల్డ్ ట్రాన్స్ ఫోర్డ్ క్రికెట్ స్టేడియం కిటకిటలాడుతోంది..
భారతదేశమంతా ఊపిరి బిగపట్టుకుని టీవీల ముందు కూర్చుని ఉంది..
ఆరోజు న్యూజిలాండ్- ఇండియా మధ్య సెమీఫైనల్ పోరు..
అంతవరకు అద్భుతంగా సాగిన ఇండియా ప్రయాణం సెమీస్ ముంగిట నిలిచి ఉంది.
రోహిత్ శర్మ 5 సెంచరీలతో బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. తనొక్కడే మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపిస్తున్నాడు.
అంతేకాదు లెజండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆఖరి మ్యాచ్…
ఎన్నో ప్రత్యేకతల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.
ఛేజింగ్ లో ఇండియన్స్ బ్యాటింగ్ కి వచ్చారు. రెండో ఒవర్ మూడో బంతికి 5 సెంచరీలు చేసిన అరవీర భయంకరుడు రోహిత్ శర్మ 1 పరుగు చేసి పుటుక్కున అవుట్ అయిపోయాడు. అంతే భారతీయుల గుండె గుభేల్ మంది. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన కింగ్ కొహ్లీ (1) మూడో ఓవర్ 4వ బంతికి క్రీజులో నిర్లక్ష్యంగా కదిలి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయిపోయాడు.
భారతీయులందరికీ షాక్ మీద షాక్…ఇంకా ఎవరూ తేరుకోలేదు.
స్కోరు బోర్డు నడుస్తుండగానే 4 ఓవర్ మొదటి బంతికి ఎప్పుడెలా ఆడతాడో తనకే తెలియని కేఎల్ రాహల్ (1) క్యూ కట్టాడు. 3.1 ఓవర్లలో 5 పరుగులకి 3 వికెట్లు పడి పీకల్లోతు కష్టాల్లో భారత్ మునిగిపోయింది.ఇంక మునిగిపోతున్న ఆ పడవని లేపడానికి అందరూ చేసిన ప్రయత్నం నెరవేరలేదు. ధోనీ (51), రవీంద్ర జడేజా (77) చేసిన ప్రయత్నం వ్రథా అయ్యింది. 18 పరుగులతో పరాజయం పాలై అవమానభారంతో ఇండియాకి తిరిగి వచ్చింది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, 2023 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా సెమీస్ లో ఇండియాని ఎదుర్కోబోయేది న్యూజిలాండ్ అని దాదాపు ఫిక్స్ అయినట్టుగానే ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 15న జరగబోయే తొలి సెమీఫైనల్ లో మరి భారత్ ఆనాడు జరిగిన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకోవాలని భారతీయులు అందరూ ఎదురుచూస్తున్నారు.
లీగ్ ల్లో ఒకసారి దెబ్బతిన్న న్యూజిలాండ్ ఈసారి భారత్ తో వళ్లు దగ్గర పెట్టుకుని ఆడుతుంది. అంతే కాదు కేన్ మామ వ్యూహాలు చాలా పదునుగా ఉంటాయి. ఎప్పుడే బౌలర్ ను వాడతాడో, ఎక్కడ ఏ ఫీల్డర్ ని పెడతాడో ఊహించడం కష్టం. తనకి ఉన్న అతికొద్ది వనరులతోనే అద్భుతాలు చేస్తుంటాడు. అదంతా కెప్టెన్సీ మాయ. ఇది మళ్లీ ధోనీలో కనిపిస్తుంది.
వారిద్దరి క్వాలిటీలు రోహిత్ శర్మలో ఉన్నాయా అంటే ఆలోచించాల్సిందే. రెండోది ఎప్పటిలా మన పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీ మీదే ఆశలు పెట్టుకోవాలి.ఎందుకంటే కివీస్ జట్టులో రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, డేవాన్ కాన్వే కీలకంగా ఉన్నారు. కెప్టెన్ విలియమ్సన్ కూడా ఫామ్ లోకి వచ్చాడు.2019 సెమీస్ లో విరాట్ కొహ్లీ వికెట్ తీసింది..బౌలర్ ట్రెంట్ బోల్ట్ అన్నది మరిచిపోకూడదు. చాలా ప్రమాదకర బౌలర్. తనకి తోడు మరో బౌలర్ మిచెల్ శాంటర్న్ ఉన్నాడు. వీళ్లంతా మ్యాచ్ విన్నర్లుగానే ఉన్నారు.
ఇప్పుడు సెమీ ఫైనల్ జరగబోయేది… ప్రమాదకర ముంబైలోని వాంఖేడి స్టేడియంలో అన్నది మరువకూడదు. గ్రౌండ్ చాలా చాలా చిన్నగా ఉంది. ఇలా కొడితే అలా సిక్స్ లు వెళ్లిపోతుంటాయి. ఆఫ్గనిస్తాన్ తో జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ విధ్వంసం 201 ఇక్కడే జరిగింది. రోహిత్ శర్మ, శ్రేయాస్, సూర్యకుమార్ వీళ్లందరూ హార్డ్ హిట్టర్లే. కానీ అవుట్ కాకుండా ఆడితే మాత్రం కివీస్ పై నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది.