Paris Paralympics 2024: ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. ప్రతి ఆటగాడికి ఒక గోల్ ఉండాలి. పారిస్ వెళ్లిన పారాలింపిక్స్ మేనేజ్మెంట్ కూడా ఒక గోల్ పెట్టుకుని వెళ్లింది. అదేమిటంటే…ఈసారి 25 పతకాలు సాధించాలనే లక్ష్యంతో, ఆ టార్గెట్ దిశగా గత మూడేళ్లుగా ప్రయత్నిస్తూ వెళ్లింది. ఇప్పుడా లక్ష్యం నెరవేరే సమయం ఆసన్నమైంది.
మన అథ్లెట్లు నేటికి 24 పతకాలతో దూసుకెళుతున్నారు. అలాగే పారాలింపిక్స్ ఆడే దేశాల్లో 13వ స్థానంలోకి వచ్చి నిలిచారు. ఇంకా మూడు రోజుల ఆట ఉంది. మరికొన్ని పతకాలు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
తాజాగా పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్‌లో ఆర్చర్ 33 ఏళ్ల హర్విందర్ సింగ్ స్వర్ణ పతకం సాధించాడు. పోలాండ్‌కు చెందిన లుకాస్జ్ సిజెక్‌ను 6-0తో ఓడించాడు. అటు ఒలింపిక్స్‌లో కూడా ఆర్చరీలో ఇంతవరకు గోల్డ్ మెడల్ రాలేదు. దీంతో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ అథ్లెట్‌గా హర్వీందర్ చరిత్ర సృష్టించాడు.
Also Read: పారాలింపిక్స్ ఆర్చరీలో భారత్ కు తొలి బంగారు పతకం.. పారిస్ లో హర్విందర్ సింగ్ అద్భుత ప్రదర్శన
ఇక క్లబ్ త్రో ఎఫ్ 51 ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించిన తొలి ఆటగాడిగా ధరంబీర్ నిలిచాడు. ఫైనల్లో 34.92 మీటర్ల త్రో సాధించి గోల్డ్ బాయ్ గా మెరిశాడు. మరోవైపు ఇదే ఈవెంట్ లో ప్రణవ్ సూర్మ రజతం సాధించాడు. తను 34.59 మీటర్ల త్రో సాధించి రజత పతకం సాధించాడు.
టోక్యో పారాలింపిక్స్ భారత్ 19 పతకాలు సాధించింది. అందుకే ఈసారి 25 పతకాలే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగింది ప్రస్తుతం 24 దగ్గర ఆగింది. ఆ ఒక్కటీ వచ్చే ఘడియలు మరెంతో దూరంలో లేవని అంటున్నారు. ఇందులో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి.