T20 : T20 వరల్డ్ కప్ లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమికి… ఆ జట్టు క్రికెటర్లు, అభిమానులు సాకులు వెతుకుతున్నారు. క్రికెటర్లేమో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ అంటూ రాగం తీస్తుంటే… అభిమానులేమో వరుణుడి వల్లే ఓడిపోయామంటూ పల్లవి అందుకున్నారు. దాంతో… మరోసారి బంగ్లా క్రికెటర్లు, అభిమానులకు భారత్ నుంచి గట్టి కౌంటర్లు పడుతున్నాయి.
టీమిండియా చేతిలో తమ ఓటమికి విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ కారణమని విమర్శించాడు… బంగ్లా బ్యాటర్ నురుల్ హసన్. అయినా తమకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు రాలేదని… ఆ రన్స్ తేడా వల్లే ఓడిపోయామని ఆరోపించాడు. అక్షర్ పటేల్ వేసిన 7వ ఓవర్లో బంగ్లా బ్యాటర్ షాంటో డీప్ మిడ్ వికెట్ వైపు బంతిని కొడితే… అర్ష్‌దీప్ దాన్ని అందుకుని కీపర్‌కు విసిరాడు. అయితే మధ్యలో విరాట్ కోహ్లీ చేతిలో బంతి లేకపోయినా నాన్‌స్ట్రైకర్ వైపు విసిరినట్లు నటించాడు. ఈ ఘటనపైనే నురుల్ విమర్శలు చేశాడు. దాంతో… అది కోహ్లీ సరదాగా చేశాడని… ఫేక్ ఫీల్డింగ్ కానేకాదని… అయినా ఓటమికి కారణాలు వెతుక్కోవడం బంగ్లా క్రికెటర్లకు అలవాటేనని భారత ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు.
నిబంధనల ప్రకారం… బ్యాటర్ పరుగు తీస్తున్నప్పుడు ఫీల్డర్ మోసం చేసే ఉద్దేశంతో ప్రవర్తించకూడదు. ఈ నిబంధన ఉల్లంఘించినట్లు అంపైర్లు గమనిస్తే… బ్యాటింగ్ చేసే జట్టుకు అదనంగా ఐదు పరుగులు ఇవ్వొచ్చు. ఆ బంతిని డెడ్ బాల్ లేదా నో బాల్ అని ప్రకటించవచ్చు. బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు ఇచ్చే విషయంలో తుది నిర్ణయం ఫీల్డ్ అంపైర్లదే. అయితే ఫీల్డర్ ఇలా చేశాడని అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాల్సింది మాత్రం… బ్యాటరే. అప్పుడే ఫీల్డ్ అంపైర్లు చర్చించి… అవసరమైతే థర్డ్ అంపైర్ సాయం కోరి… చర్యలు తీసుకుంటారు. అయితే బంగ్లా బ్యాటర్ కానీ, ఫీల్డ్ అంపైర్లు కానీ కోహ్లీ తప్పు చేసినట్లు గుర్తించలేదు. ఈ ఘటనపై నురుల్ అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని భారత అభిమానులు మండిపడుతున్నారు.