Indian pairs lead in Australian Open : జీవన్-శ్రీరామ్, సానియామీర్జా-రోహన్ బోపన్న జోడీలు.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ముందంజ వేశాయి. తన కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న సానియా మీర్జా, రోహన్ బోపన్నతో కలిసి ఆ్రస్టేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సానియా–రోహన్ జోడీ 7–5, 6–3 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన జైమీ ఫోర్‌లిస్–ల్యూక్ సావిల్లె జంటపై నెగ్గింది. 74 నిమిషాల సేపు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేయడం విశేషం.
ఇక చివరి నిమిషంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్న భారత మెన్స్ డబుల్స్ జోడీ జీవన్–శ్రీరామ్… రెండో రౌండ్‌కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో భారత జోడీ 7–6(8/6), 2–6, 6–4 తేడాతో ఐదో సీడ్ ఇవాన్ డోడిగ్(క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీని బోల్తా కొట్టించి రెండో రౌండ్‌లో ప్రవేశించింది.
మరోవైపు… ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన ఈ సెర్బియా స్టార్… పదోసారి కూడా గ్రాండ్‌స్లామ్ నెగ్గే దిశగా మరో అడుగు ముందుకేశాడు. మూడో రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జొకోవిచ్ 7–6(9/7), 6–3, 6–4 తేడాతో బల్గేరియాకు చెందిన 27వ సీడ్ దిమిత్రోవ్‌పై గెలిచి… టోర్నీలో 13వసారి ప్రీ క్వార్టర్ ఫైనల్ చేరాడు.
ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదుసార్లు రన్నరప్ అయిన బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే… మూడో రౌండ్లో చతికిలబడ్డాడు. తొలి రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో ఐదు సెట్ల పాటు పోరాడి గెలిచిన ముర్రే… మూడో రౌండ్‌లోనూ పోరాడినా విజయం వరించలేదు. స్పెయిన్ ఆటగాడు బాటిస్టా అగుట్ 6–1, 6–7(7/9), 6–3, 6–4 తేడాతో ముర్రేపై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్ చేరాడు.
Follow this link for more updates : Bigtv