Bangladesh: ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడితే వారిపై నిషేధం విధించడం మీరు చూసే ఉంటారు. ఇన్నాళ్లు పురుష క్రికెటర్లకే పరిమితమైన ఈ మ్యాచ్ ఫిక్సింగ్ జాడ్యం.. ఇప్పుడు మహిళా క్రికెట్ కి అంటుకుంది. బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ షోహేలి అక్తర్ {34} పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ {ఐసీసీ} ఐదేళ్ల నిషేధం విధించింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి ఆమె ఐదేళ్లపాటు దూరంగా ఉండాలని ఐసీసీ ఆదేశించింది.
ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ కింద చర్యలు తీసుకున్నట్లు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన తొలి మహిళ క్రికెటర్ గా షోహేలి అక్తర్ నిలిచింది. 2023లో జరిగిన మహిళల టీ-20 ప్రపంచ కప్ సందర్భంగా బంగ్లాదేశ్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆమె ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించింది.
నిజానికి 2022లోనే క్రికెట్ కి గుడ్ బై చెప్పిన ఆమె.. ఆ వరల్డ్ కప్ లో లేకపోయినా టోర్నీ ఆడుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్ ని సంప్రదించి ఫిక్స్ చేయాల్సిందిగా కోరింది. తాను చెప్పినట్లుగా ఆ బంగ్లాదేశ్ క్రికెటర్ హిట్ వికెట్ అయితే.. రెండు మిలియన్ల టాకాలు {బంగ్లాదేశ్ కరెన్సీ} ఇస్తానని ఆశ చూపింది. కానీ సదరు బంగ్లా క్రికెటర్.. షోహేలి ప్రతిపాదనను తిరస్కరించడంతోపాటు వెంటనే ఈ విషయాన్ని ఐసిసి అవినీతి నిరోధక విభాగం {ఐసీయూ} దృష్టికి తీసుకువెళ్లింది.
దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన ఏసీయూ.. షోహెలి మ్యాచ్ ఫిక్సింగ్ కి ప్రయత్నించినట్లు తేల్చింది. ఐసీసీ లోని ఐదు ఆర్టికల్స్ ని ఆమె అతిక్రమించిందని.. దీంతో నిషేధాన్ని విధించామని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా – బంగ్లాదేశ్ మ్యాచ్ కి ముందు రోజు ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా సదరు క్రికెటర్ ని సంప్రదించినట్లు విచారణలో షోహేలీ అంగీకరించింది.
అయితే ఈ ఫిక్సింగ్ ఆరోపణలు గతంలో షోహేలి ఖండించింది. కానీ ఐసీయూ లోతుగా దర్యాప్తు చేపట్టడంతో నిజాన్ని ఒప్పుకుంది. ఐసీసీ విచారణలో ఫిక్సింగ్ కి ప్రయత్నించినట్లు తేలడంతో పలు నిబంధనల కింద ఆమెపై ఐదేళ్ల నిషేధం విధించింది. ఈనెల 10 నుండి షోహేలీపై నిషేధం అమల్లోకి వస్తుందని ఐసిసిఐ మంగళవారం ప్రకటించింది.
ఇక ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడిన పదిమంది భరత ఆటగాళ్ల జాబితాను చూస్తే.. ఇందులో ముఖ్యంగా శ్రీశాంత్ పేరు వినబడుతుంది. కానీ ఇంకా చాలామంది ఉన్నారు. 2012 ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ ఆటగాడు టి.పి సురేంద్ర, మొహ్నీష్ మిశ్రా, అమిత్ యాదవ్, అభినవ్ బాలి, శలబ్ శ్రీవాస్తవ, అంకిత్ చవాన్, అమిత్ సింగ్, అజిత్ చండీలా, సిద్ధార్థ్ త్రివేది, హికెన్ షా వంటి ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డారు.