Champions Trophy 2025: భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో ఉత్కంఠ వీడింది. భారత జట్టుకు, క్రీడాభిమానులకు నిరాశే మిగిలింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. గత రాత్రి ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన ఐదవ టెస్టులో గాయపడిన బుమ్రా.. అప్పటినుండి విశ్రాంతిలోనే ఉన్నాడు. అయితే పూర్తిస్థాయిలో కోలుకోలేకపోవడం, వెన్ను కింది భాగంలో గాయం కారణంగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైనట్లు బిసిసిఐ పేర్కొంది.
అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రానని జట్టులోకి తీసుకువచ్చారు. ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం గత నెల ప్రకటించిన జట్టులో బుమ్రా కి చోటు కల్పించారు. అతడు తిరిగి జట్టులోకి వస్తాడని సెలక్టర్లు, బీసీసీఐ కూడా భావించింది. జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకునే ప్రక్రియను మొదలుపెట్టాడు బుమ్రా. ఐదుగురుతో కూడిన ప్రత్యేక బృందం ఎంతో కసరత్తు చేసినా ఫలితం దక్కలేదు.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేయడానికి మంగళవారం తుది గడువు అయినందువల్ల ఈ ప్రత్యేక బృందం బుమ్రా ఫిట్నెస్ పై బోర్డుకు తుది నివేదికను సమర్పించింది. అతడు మళ్లీ బౌలింగ్ చేస్తే గాయం తిరగబడచ్చని.. అందువల్ల అతడిని జట్టు నుంచి దూరంగా ఉంచడమే మంచిదని సూచించారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడకపోవడం భారత జట్టుకు పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పవచ్చు. అయితే బుమ్రా స్థానంలో హర్షిత్ రానా ఎంపికపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని సైతం ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి ఎంపిక చేశారు. ఇప్పుడు బుమ్రా స్థానంలో హర్షిత్ రానా ని తీసుకువచ్చారు. కానీ సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం వివాదానికి కారణమైంది. ఇటీవల హైదరాబాద్ రంజి టీమ్ తో కలిసి ప్రాక్టీస్ చేయడంతో పాటు దేశవాళి క్రికెట్ లో బరిలోకి దిగిన సిరాజ్.. విదర్భతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 18 ఓవర్లు బౌలింగ్ చేసి.. ఏడు ఓవర్లు మేయిడిన్ చేసి ఒక వికెట్ పడగొట్టాడు.
ఓ దశలో సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో, మరో దిశలో హైదరాబాద్ బౌలర్లు వికెట్లు దక్కించుకున్నారు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో 20 ఓవర్లు బౌలింగ్ చేసి, నాలుగు మెయిడిన్ ఓవర్లు వేసి.. మూడు వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ లలో సిరాజ్ ఎకానమీ 3 దాటలేదు. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని తెలిపాడు. అయితే గాయం కారణంగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే.. అతడి స్థానంలో సిరాజ్ ని జట్టులోకి తీసుకుంటారని ముందు నుంచి అంతా భావించారు.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా దూరం.. అతను వస్తున్నాడు ?
కానీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ సీనియర్ బౌలర్ ని పక్కన పెట్టి.. కొత్త ఆటగాడైన హర్షిత్ రానాని జట్టులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎంపికలో కుట్రలు జరిగాయని, కోచ్ గౌతమ్ గంభీర్ కావాలనే సిరాజ్ ని పక్కన పెట్టారనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే కోచ్ గౌతమ్ గంభీర్.. హైదరాబాది ఆటగాడు సిరాజ్ ని తొక్కేసాడంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు క్రీడాభిమానులు. చాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమ్ ఇండియా స్క్వాడ్: రోహిత్ (సి), గిల్ (విసి), కోహ్లి, శ్రేయాస్, రాహుల్, పంత్, పాండ్యా, అక్సర్, సుందర్, జడేజా, కుల్దీప్, షమీ, అర్ష్‌దీప్, హర్షిత్, వరుణ్.