
India vs Pakistan Asia cup 2023(Sports news in telugu) :
వర్షం వల్ల రెండు రోజులపాటు జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. 228 పరుగుల భారీ తేడాతో పాక్ పై విజయభేరి మోగించింది. దయాది జట్టుపై ఇదే భారత్ కు అత్యంత భారీ విజయం. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ మన్ గిల్ అదిరే ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత సెంచరీలతో కోహ్లీ, రాహుల్ విధ్వంసం సృష్టించారు. దీంతో 357 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ కు భారత్ నిర్దేశించింది.
లక్ష్య చేధనలో పాకిస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలుత టీమిండియా పేసర్లు పాక్ టాప్ ఆర్డర్ ను కూల్చేశారు. బూమ్రా, హార్థిక్ పాండ్యా, శార్థుల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఓపెనర్ ఇనామ్ హుల్ హక్ ను బూమ్రా పెవిలియన్ కు పంపాడు. కెప్టెన్ బాబర్ అజామ్ ను హార్థిక్ అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత శార్ధుల్ బంతిని అంచనా వేయలేక రిజ్వాన్ అవుట్ అయ్యాడు. దీంతో పాకిస్థాన్ 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
మరో ఓపెనర్ ఫఖర్ జమాన్ ( 27), అగా సల్మాన్ (23) క్రీజులో నిలబడే ప్రయత్నం చేశారు. అయితే వారిని కులదీప్ యాదవ్ అవుట్ చేసి పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో వందలోపే పాకిస్థాన్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత షాదాబ్ ఖాన్ ను కులదీప్ పెవిలియన్ కు పంపాడు. మరోవైపు ఇఫ్తికార్ అహ్మద్ (23) కాసేపు పోరాటం చేసేందుకు ప్రయత్నించినా చివరకు కులదీప్ కు చిక్కాడు. ఫాహీమ్ అష్రఫ్ ను కులదీప్ బౌల్డ్ చేయడంతో పాకిస్థాన్ 128 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. గాయాలతో నసీమ్ షా, హరీష్ రవూఫ్ బ్యాటింగ్ రాలేదు. దీంతో పాక్ ఇన్నింగ్ ముగిసింది. భారత్ క్రికెట్ చరిత్రలోనే పాక్ పై అతి పెద్ద విజయం నమోదైంది.
కులదీప్ యాదవ్ 5 వికెట్లు, బూమ్రా, హార్థిక్, శార్థుల్ తలో వికెట్ తీశారు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ అనేక రికార్డులు బద్దలుగొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా అంటే 277 ఇన్నింగ్స్ లోనే 13 వేల పరుగులు పూర్తి చేశాడు. 13 వేల పరుగుల చేయడానికి సచిన్ కు 321 ఇన్నింగ్స్ లు పట్టాయి. రికీ పాంటింగ్ 341 ఇన్నింగ్స్ ల్లో ఈ మార్కు అందుకున్నాడు.
వన్డేల్లో కోహ్లీ ఇప్పటి వరకు 47 సెంచరీలు చేశాడు. మరో రెండు శతకాలు కొడితే సచిన్ ను సమం చేస్తాడు. ఇప్పటి వరకు అన్ని పార్మాట్లలో కలిపి కోహ్లీ 77 సెంచరీలు చేశాడు. అలాగే కొలంబో మైదానంలో కోహ్లీ వరుసగా నాలుగో సెంచరీ కొట్టాడు. ఆసియా కప్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న భారత్ బ్యాటర్ గానూ మరో రికార్డును విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో సురేష్ రైనా, సిద్ధూ తలో 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్నారు. ఇలా ఈ మ్యాచ్ లో కోహ్లీతోపాటు భారత్ కు ప్రత్యేకంగా నిలిచింది.