
Balakrishna press conference(Latest political news in Andhra Pradesh):
టీడీపీ అధినేతి చంద్రబాబును కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించారని మండిపడ్డారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబుపై సీఎం జగన్ కుట్ర చేశారని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి ప్రతిపక్షాలపై కక్షసాధింపే లక్ష్యంగా జగన్ పని చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.
జైలుకు వెళ్లొచ్చిన జగన్ అందర్నీ జైలుకు పంపాలని టార్గెట్ పెట్టుకున్నారని బాలయ్య ఆరోపించారు. జగన్‌పై అనేక కేసులున్న విషయాన్ని ప్రస్తావించారు. బెయిల్‌పై బయట తిరుగుతున్న జగన్ వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ప్రతిపక్షనేతలపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 16 నెలలు జైలులో ఉన్న జగన్.. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని చూస్తున్నారని తెలిపారు.
పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా? అని ప్రశ్నించారు. హిందూపురంలో 1,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? అని నిలదీశారు. ఛార్జిషీట్ ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని బాలయ్య ఫైర్ అయ్యారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని తొలుత గుజరాత్‌లో ప్రారంభించారని బాలకృష్ణ చెప్పారు. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు పాలసీ మేకర్ మాత్రమేనని పేర్కొన్నారు. కార్యక్రమాలను అధికారులే అమలు చేస్తారని వివరించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని అజేయ కల్లం ప్రతిపాదించారని ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారని తెలిపారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసిందని లెక్కలు వివరించారు. 2.13 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చారని తెలిపారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన డిజైన్ టెక్ సంస్థకు వైసీపీ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఇలాంటి కేసులు ఎన్నో చూశామని.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబును బ్రాండ్ గా బాలయ్య పేర్కొన్నారు. న్యాయ పోరాటం చేస్తామన్నారు. జగన్ ఉన్న సంస్థలను విధ్వంసం చేసి.. యువతను గంజాయికి బానిస చేశారని ఘాటు విమర్శలు చేశారు.ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మొరిగితే పట్టించుకోనని అతిక్రమిస్తే ఉపేక్షించనని తనదైన శైలిలో బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన వారిని కలుస్తానని తెలిపారు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడదామంటూ పార్టీ శ్రేణులకు బాలకృష్ణ సందేశమిచ్చారు.