IPL 2025: సౌత్ ఆఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో గుజరాత్ టైటాన్స్ {జిటి} తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ 18వ సీజన్ లో తొలి రెండు మ్యాచ్ లు ఆడిన ఈ సఫారీ పేసర్ బుధవారం {ఏప్రిల్ 2} న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ కి దూరమయ్యాడు. రబడ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయినట్లు అతడి ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది.
వ్యక్తిగత కారణాలవల్లే అతడు ఐపిఎల్ ని వీడినట్లు గురువారం పేర్కొంది. అయితే రబడా తిరిగి మళ్లీ వస్తాడా..? లేదా..? ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తాడు..? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక బుధవారం రాయెల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో అతని స్థానంలో అర్షద్ ఖాన్ ని తుది జట్టులోకి తీసుకున్నారు. రబడా ఆడిన తొలి రెండు మ్యాచ్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక రబడా గైర్హాజరుతో సౌత్ ఆఫ్రికా కి చెందిన గేరాల్డ్ కొట్టి లేదా ఆఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ కరీమ్ జనత్ పై గుజరాత్ ఆధారపడే అవకాశం ఉంది.
రబాడ తన స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవడంతో ఏప్రిల్ 6న సన్రైజర్స్ హైదరాబాద్ తో జరగబోయే మ్యాచ్ కి దూరం కానున్నాడు. రబడ లాంటి టాప్ క్లాస్ బౌలర్ లేకపోవడం గుజరాత్ కి పెద్ద ఎదురు దెబ్బెనని చెప్పవచ్చు. ఇతడిని ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 10.75 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. 2024 ఐపీఎల్ సీజన్ లో రబడా పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు.
ఇక ఐపీఎల్ తొలి మ్యాచ్ తర్వాత బ్యాటర్లకు అనుకూలంగా తయారు చేస్తున్న పిచ్, రూల్స్ పై రబాడ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత బంతికి, బ్యాట్ కి మధ్య సమతుల్యత ఉండాలని సూచించాడు. ఆటగాళ్లకు వినోదాన్ని పెంచడానికి ప్రతి మ్యాచ్ లో ఫ్లాట్ వికెట్ తయారు చేయకూడదని.. మనం ఆడే ఆటకు క్రికెట్ బదులు బ్యాటింగ్ అనే పేరు పెట్టవచ్చునని కీలక వ్యాఖ్యలు చేశాడు.
అయితే రబాడా పిచ్ లపై విమర్శలు చేయడంతో.. బీసీసీఐ అతని టార్గెట్ చేసిందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రబాడ ఈ లీగ్ ని వదిలి వెళ్లాడని ఊహగణాలు వినిపిస్తున్నాయి. అయితే ఆర్సిబి తో జరిగిన మ్యాచ్ లో రాబడా ని జట్టులోకి తీసుకోలేదు గుజరాత్. ఇందుకు ఆ జట్టు కెప్టెన్ గిల్ చెప్పిన కారణం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వ్యక్తిగత కారణాలవల్ల రాబడాను ఆడించడం లేదని అన్నాడు గిల్.
దీంతో లేనిపోని సందేహాలు తలెత్తాయి. అతడిని కావాలనే తప్పించారా.? అనే ఊహగాణాలు వినిపించాయి. ఇలా ఆర్సిబి తో జరిగిన మ్యాచ్ లో అతడిని దూరం పెట్టడంతోనే.. తిరిగి తన స్వదేశానికి వెళ్ళిపోయాడని అంటున్నారు. బీసీసీఐ పై సీరియస్ అయిన రబడా ని జట్టులోకి తీసుకోవద్దని జిటి మేనేజ్మెంట్ కి బీసీసీఐ నుండి ఆదేశాలు వెళ్లాయని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్స్ పై గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.