Indian Premier League 2024 Winner KKR: ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో వ్యూహాలు, ఎన్నో ఎత్తుగడలు, వైఫల్యాలు.. ఇలా ఫైనల్ వరకు సాగిన ప్రయాణంలో ఆఖరిమెట్టుపై సమష్టిగా రాణించి కోల్ కతా నైట్ రైడర్స్ విజయపతాకాన్ని ఎగురవేసింది. ఇక పడుతూ లేస్తూ ఫైనల్ వరకు వచ్చిన హైదరాబాద్ చేజేతులారా మ్యాచ్ ని పోగొట్టుకుని నిరాశలో కూరుకుపోయింది.
మ్యాచ్ ఆసాంతం అందరికీ అర్థం కాని విషయం ఏమిటంటే, ఫస్ట్ బ్యాటింగ్ లో హైదరాబాద్ ఎంతో అవస్థ పడింది. ప్రతీ బాల్ ని ఎలా ఆడాలో అర్థం కాక తలలు పట్టుకుంది. ఈ క్రమంలో 18.3 ఓవర్లలో 113 పరుగులకే చతికిల పడింది. మరి అదే పిచ్ పై…ఇంకా డ్యూ కూడా రాని అదే పరిస్థితుల్లో..కోల్ కతా ఇరగదీసి ఆడింది. 10.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇదెలా సాధ్యమైందని నెట్టింట ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
చెన్నయ్ చెపాక్ స్టేడియంలో రాజస్థాన్ పై ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిన హైదరాబాద్ అదే స్ట్రాటజీని ఫైనల్ మ్యాచ్ లో కూడా కొనసాగించింది. అదే గెలుపు సూత్రంతో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. కానీ కోల్ కతా అద్భుత బౌలర్స్ ముందు వీరి ఆటలు సాగలేదు.
తొలి ఓవర్ నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. పవర్ ప్లే ఇంకా ముగియకుండానే.. 4.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 21 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 7వ ఓవర్ వచ్చేసరికి 5 వికెట్ల నష్టానికి 62 పరుగులతో లేవలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. 77 పరుగులకి 7 వికెట్లు, 90 పరుగులకి 8 వికెట్లు, 113 పరుగుల వద్ద మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. అలా హైదరాబాద్ కథ ముగిసిపోయింది.
హైదరాబాద్ ఆటగాళ్ల స్కోరు చూస్తే…అందరూ నోరెళ్ల బెడతారు. ట్రావిస్ హెడ్ గోల్డెన్ డకౌట్ తో పతనం మొదలైంది. అభిషేక్ శర్మ (2), రాహుల్ త్రిపాఠి (9), మార్క్రమ్ (20), నితీష్ కుమార్ (13), క్లాసెన్ (16), షాబాజ్ అహ్మద్ (8), సమద్ (4), ఉనద్కట్ (4) ఇలా చేశారు. చివర్లో కెప్టెన్ కమిన్స్ ఒక్కడే హయ్యస్ట్ స్కోరు. 19 బంతుల్లో 1 సిక్సర్, 2 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేశాడు. తను ఆ మాత్రం కూడా చేసి ఉండకపోతే 100 లోపే హైదరాబాద్ ఆల్ అవుట్ అయిపోయేది.
వీరి ఓటమికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి పిచ్ ప్రభావమైతే, రెండవది ఆ పిచ్ స్వభావాన్ని అందిపుచ్చుకుని అద్భుతంగా బౌలింగ్ చేసిన కోల్ కతా బౌలర్లు అని చెప్పాలి.
మిచెల్ స్టార్క్ 2, వైభవ్ 1, హర్షిత్ రాణా 2, సునీల్ నరైన్ 1, ఆండ్రీ రసెల్ 3, వరుణ్ 1 వికెట్లు పడగొట్టారు. హైదరాబాద్ పతనాన్ని శాసించారు. ఇక్కడందరూ గుర్తు పెట్టుకోవల్సింది.. ప్రతీ బౌలర్ ఒక వికెట్ అయినా తీయడం విశేషం.
అనంతరం 114 లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా అస్సలు భయపడలేదు. తక్కువ స్కోరే కదా, జాగ్రత్తగా ఆడదామని అనుకోలేదు. మొదటి ఓవర్ నుంచి బాదుడే బాదుడు మొదలెట్టారు. ఏ దశలోనూ హైదరాబాద్ బౌలర్లను కోలుకోనివ్వలేదు. అప్పటికి కెప్టెన్ క్లాసిన్ బౌలింగులో సునీల్ నరైన్ (6) అవుట్ అయ్యాడు.
కొద్దిగా హైదరాబాద్ లో ఆశలు విరిశాయి. పిచ్ తమకి కూడా సహకరిస్తుందని అనుకున్నారు. కానీ వెంకటేశ్ అయ్యర్ వచ్చి చిచ్చరపిడుగులా చెలరేగాడు. 26 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తనే మ్యాచ్ ని ఒంటిచేత్తో గెలిపించాడు.
Also Read: ముచ్చటగా మూడోసారి.. ట్రోఫీ కేకేఆర్ వశం.. ఫైనల్లో సన్‌రైజర్స్ ఘోర పరాజయం..
మరో ఎండ్ లో ఓపెనర్ గుర్భాజ్ కూడా ఆత్మవిశ్వాసంతో ఆడాడు. 32 బంతుల్లో 2 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరికి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (6) వచ్చి లాంఛనం పూర్తి చేశాడు. 10.3 ఓవర్లలో కోల్ కతా జైత్రయాత్ర విజయవంతంగా ముగిసింది. సగర్వంగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.
చెపాక్ స్టేడియంలో సంబరాలు అంబరాన్ని అంటుతుండగా విజయగర్వంతో కోల్ కతా జట్టు సభ్యులు ట్రోఫీని ఎత్తి పట్టుకుని ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. 2024 ఐపీఎల్ ట్రోఫీ చివరకు ఎన్నో మలుపులు తిరిగి కోల్ కతా చేతికి చేరింది.