IPL Trophy SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2024 సీజన్ లో అద్భుత ఆట తీరుతో ఫైనల్ వరకు చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. రెండవ ఐపీఎల్ కప్ కి అడుగు దూరంలో ఆగిపోయింది. కానీ 2025 సీజన్ లో మాత్రం కప్పు కొట్టడానికి అన్ని విధాలుగా సిద్ధం అయ్యి రంగంలోకి దిగుతుంది. సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఈసారి పూర్తి ప్రణాళికలతో పటిష్టమైన జట్టును తయారు చేశారు.
గత సీజన్ లో అద్భుత ప్రదర్శన చేసిన ప్లేయర్స్ హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావీస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డిలను రిటైన్ చేసుకోవడంతోపాటు వేలంలో కూడా మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసింది కావ్య మారన్. వేలంలో మొహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్ వంటి అనుభవం ఉన్న ఆటగాళ్లతో పాటు అభినవ్ మనోహర్, ఇషాన్ మలింగ వంటి యంగ్ ప్లేయర్స్ ని కూడా కొనుగోలు చేసి జట్టును బలోపేతం చేసింది. ఈ సీజన్ లో ఎలాగైనా కప్ సాధించాలని పట్టుదలతో ఉంది సన్రైజర్స్ హైదరాబాద్.
2024 సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయాలలో ట్రావీస్ హెడ్, అభిషేక్ శర్మ లది ముఖ్యపాత్ర. వీరిద్దరూ మంచి భాగస్వామ్యాలను నిర్మిస్తూ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించారు. ఇక ఈసారి మూడవ స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. నాలుగవ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, అలాగే క్లాసెన్ ఫినిషింగ్ కోసం ఫ్లోటింగ్ ప్లేయర్ గా మ్యాచ్ పరిస్థితిని బట్టి బ్యాటింగ్ కి పంపించే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ లో అధర్వ థైడే మీద ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కమీన్స్, హర్షల్ పటేల్ కూడా బ్యాటింగ్ లో కొన్ని మెరుపులు మెరిపించే అవకాశాలు ఉన్నాయి.
ఇక బౌలింగ్ యూనిట్ కూడా అద్భుతంగా ఉంది. కమీన్స్ బౌలింగ్ ఎక్స్పీరియన్స్ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక షమీ పవర్ ప్లే, డెత్ ఓవర్లలో వికెట్లు పడగొట్టడంలో సిద్ధహస్తుడు. అలాగే హర్షర్ పటేల్ వీరిద్దరికీ అండగా మిడిల్ ఓవర్ల బాధ్యత తీసుకుంటాడు. ఇక పిచ్ ని బట్టి రాహుల్ చాహర్, జంపా లలో ఒకరిని స్పిన్నర్ గా తీసుకోవచ్చు.
అయితే ఐపీఎల్ 25 సీజన్ ఇంకా ప్రారంభం కాకముందే.. ఈసారి ట్రోఫీనీ ముద్దాడే జట్టు ఏదనే అంచనాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఈసారి కప్ గెలిచే అవకాశాలు హైదరాబాద్ జట్టుకి ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు క్రీడాభిమానులు. దీనికి ఒక కారణాన్ని కూడా చెబుతున్నారు. అదేంటంటే గతంలో డెక్కన్ చార్జర్స్ గా ఉన్న సమయంలో 2008లో గిల్క్రిస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు.
ఆ తర్వాత 2009లో డెక్కన్ చార్జర్స్ కప్ గెలుచుకుంది. ఇక 2017 సంవత్సరంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ బాధ్యతలు చేపట్టాడు. అనంతరం 2016లో హైదరాబాద్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఇక 2024లో పాట్ కమీన్స్ ని హైదరాబాద్ జట్టుకి కెప్టెన్ గా నియమించారు. అంటే ఈ సంవత్సరం ఐపీఎల్ 2025లో హైదరాబాద్ జట్టు కప్పు కొట్టబోతుందని, ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అంటున్నారు హైదరాబాద్ అభిమానులు.