Jasprit Bumrah: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లోని చివరి మ్యాచ్ లో వెన్నునొప్పితో బాధపడిన టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మొదట్లో బుమ్రా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటాడని, ఆ తర్వాత జట్టులోకి వస్తాడని చెప్పుకొచ్చారు. కానీ గాయం నుండి పూర్తిగా కోలుకోకపోవడంతో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్, ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు.
మొదట ఈ మెగా ఈవెంట్ కి ప్రకటించిన తాత్కాలిక జట్టులో బుమ్రాకి చోటు కల్పించింది బీసీసీఐ. కానీ ఆ తర్వాత గాయం కారణంగా జట్టు నుంచి తప్పించింది. ఈ మేరకు బోర్డు ప్రకటన విడుదల చేసింది. వెన్నునొప్పి కారణంగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. సెలక్షన్ కమిటీ అతడి స్థానంలో హర్షిత్ రానా ని ఎంపిక చేసింది. ఇక ఇటీవల అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} సమయానికి పూర్తిగా కోలుకుంటాడని వార్తలు వెలువడ్డాయి.
కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదని తెలుస్తోంది. ఈ స్టార్ బౌలర్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. ఎందుకంటే అతడి గాయం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 22 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ లో అతడు ఆడేది అనుమానంగా మారింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్న బుమ్రా.. ఐపీఎల్ లోకి తిరిగి వచ్చేందుకు మరింత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఐపీఎల్ లోని ఈ 18వ సీజన్ మార్చ్ 22 నుండి ప్రారంభం అవుతుంది.
అయితే ఈ లీగ్ లో ముంబై ఇండియన్స్ తరఫున బుమ్రా ప్రతినిథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు తొలి రెండు వారాలు ఐపిఎల్ కి దూరం కావచ్చునని తెలుస్తోంది. ఇదే జరిగితే ముంబై ఇండియన్స్ ఆడే తొలి నాలుగు లీగ్ మ్యాచ్ లకు బుమ్రా దూరం కావచ్చు. గాయం నుండి అతడు ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో కోరుకుంటున్నా నేపథ్యంలో అతడి పై పని భారం తగ్గించేందుకు బీసీసీఐ ఫోకస్ చేసింది.
ఈ నేపథ్యంలో అతడి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి అతడి మెడికల్ రిపోర్ట్ లు బాగానే ఉన్నట్లు సమాచారం. కానీ వైద్యులు అతడికి రెస్ట్ తీసుకోవాలని సూచించడంతో మరో 15 రోజులపాటు అతడు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారం లోపు అతడు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉందని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. భవిష్యత్ ప్రయోజనాల దృశ్య అతడిని తిరిగి తీసుకురావడానికి బీసీసీఐ కూడా తొందరపడడం లేదు.
అతడి గాయం చాలా తీవ్రంగా ఉన్నందున.. అతడు ఎప్పుడు మైదానంలోకి వస్తాడో చెప్పలేము అని తెలుస్తుంది. నిజానికి బుమ్రా చాలా కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే ముందుగా భారత జట్టు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అందుకే సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కోలుకొని జట్టులోకి వచ్చి.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే సిరీస్ లోని చివరి టెస్ట్ లో వెన్నునొప్పి రావడంతో మైదానం వీడాడు.