Hyderabad LalaGuda Double Murder| 40 ఏళ్లు వయసు ఉన్న ఓ మహిళ తనకు పెళ్లి కాకపోవడంతో ఒక పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఈ వ్యవహారం తన కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మహిళ కుటుంబంలో ఇద్దరు హత్యకు గురయ్యారు. తన ప్రియుడితో కలిసి తన సోదరి, తల్లిని ఆమె హత్య చేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ కేసులో ఒక హత్య గురించి విచారణ మొదలు పెట్టిన పోలీసులకు మరో హత్య ఇంతకుముందే జరిగిందని.. ఆ మృతదేహం కుళ్లిపోయిందని తెలిసి షాకయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని లాలాగూడ ప్రాంతంలో జరిగింది.
లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్స్పెక్టర్ రఘు బాబు తెలిపిన వివరాల ప్రకారం, నార్త్ లాలాగూడ ప్రాంతానికి చెందిన సుశీల (66) అనే మహిళకు నలుగురు సంతానం. ముగ్గురు కూతుళ్లు – జ్ఞానేశ్వరి (45), లక్ష్మి (40), ఉమామహేశ్వరి (35), ఒక కుమారుడు శివ (37). వీరిలో ఎవరికీ వివాహం జరగలేదు. పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరికి మానసిక స్థితి బాగా లేదు. చిన్న కూతురు ఉమామహేశ్వరి లాల్ బజార్లోని ఒక కాల్ సెంటర్‌లో పనిచేస్తుంది. కుమారుడు శివ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం సుశీల భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో.. అతని రైల్వే ఉద్యోగం రెండవ కూతురు లక్ష్మికి వచ్చింది. 2018వ సంవత్సరం వరకు వీరందరూ లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవారు. ఆ తర్వాత జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అయితే.. లక్ష్మి లాలాగూడ రైల్వే వర్క్‌షాప్‌లో ఉద్యోగం చేస్తున్నందున, ఆమె మాత్రం ఇక్కడే రైల్వే క్వార్టర్స్‌లో ఉండేది. లక్ష్మితో పాటు ఆమె అక్క జ్ఞానేశ్వరి (మానసిక స్థితి సరిగాలేని) కూడా రైల్వే క్వార్టర్స్ లో ఉండేది. కాకూర్ లోని కొత్త ఇంట్లో లక్షి తల్లి సుశీల, మరో చెల్లి ఉమామహేశ్వరి నివసించేవారు.
Also Read: కాళ్లకు మేకులు కొట్టి ఆమెను దారుణంగా చంపేశారు- భయంతో వణికిపోతున్న జనం
ఈ క్రమంలో.. జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన అరవింద్ (45) అనే వ్యక్తితో వీరి కుటుంబానికి 2010వ సంవత్సరం నుంచి పరిచయం ఉండేది. ఈ క్రమంలో లక్ష్మికి అరవింద్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. అరవింద్ కు ఇంతకుముందే పెళ్లి అయింది. అయినా నిత్యం వీరిద్దరూ కలిసి తిరుగుతుండడంతో లక్ష్మి కుటుంబ సభ్యులకు ఇదంతా నచ్చేది కాదు. ఈ విషయంలో అనేక మార్లు లక్ష్మి తల్లి సుశీలతో అరవింద్‌కు గొడవలు జరిగేవి.
ఇది ఇలా ఉండగా, ఈ నెల 6న సాయంత్రం 7 గంటల సమయంలో జవహర్ నగర్‌లోని లక్ష్మి తల్లి ఇంటికి వెళ్లిన అరవింద్, ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అరవింద్ దాడి చేయడంతో లక్ష్మి తల్లి సుశీల తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో అరవింద్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తరువాత ఆఫీసు నుంచి వచ్చిన సుశీల చిన్న కూతురు ఉమామహేశ్వరి ఇంట్లో తన తల్లి చనిపోయి ఉండడంతో ఒక్కసారిగా కంగారుపడింది. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా.. అరవింద్ గోడ దూకి పారిపోతున్నట్లు కనిపించింది. ఆమె వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం విచారణ నిమిత్తం అరవింద్, లక్ష్మి కోసం లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌లోని వారి నివాసానికి వెళ్లారు. అక్కడ లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కానీ అరవింద్ పరారీలో ఉన్నట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే మరో షాకింగ్ విషయం బయటపడింది. లక్ష్మి అక్క జ్ఞానేశ్వరి(మానసిక స్థితి సరిగాలేని) ని రెండు రోజుల క్రితం తాము చంపి సంపులో మూటకట్టి పడేసినట్లు లక్ష్మి వెల్లడించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక లాలాగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సంపులో ఉన్న మృతదేహాన్ని వెలికి తీశారు. జ్ఞానేశ్వరి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉన్నట్లు కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను వెంటబెట్టుకుని మరో నేరస్థుడు అరవింద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పూర్తి విచారణ చేసిన తర్వాత హత్యకు గల అసలైన కారణాలు.. ఎలా హత్య చేశారు?.. ఎక్కడ చంపారు అనే విషయాలు స్పష్టంగా తెలుసుకుని వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.