Ms Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ధోని మైదానంలో ఎంత ప్రశాంతంగా, సంయమనంతో ఉంటాడో అందరికీ తెలిసిందే. అందుకే ధోని ని మిస్టర్ కూల్ అని ముద్దుగా పిలుస్తారు క్రికెట్ అభిమానులు. తన కూల్ కెప్టెన్సీతో ధోని భారత జట్టుకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో, ఐపీఎల్ లో భారత్ లో అందరికంటే ధోనీ టాప్ లో ఉంటాడు. ఇక ముఖ్యంగా ఐపీఎల్ అంటనే హోరాహోరీ మ్యాచ్ లు ఉంటాయి. ఆఖరి బంతి వరకు థ్రిల్లింగ్ గా జరుగుతాయి మ్యాచ్ లు. అలాంటి థ్రిల్లింగ్ మ్యాచ్ లలో ఆఖరి ఓవర్లలో జట్టును గెలిపించడం అంత ఈజీ కాదు. కానీ మహేంద్ర సింగ్ ధోనీకి అది పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఈ గ్రేటెస్ట్ ఫినిషర్ ని కూడా భయపెట్టిన బౌలర్లు ఉన్నారట.
ఆ బౌలర్లు ఎవరో తెలిపాడు మహేంద్రసింగ్ ధోని. ఐపీఎల్ 2025 సీజన్ 18 కి ముందు ఒక కంపెనీ ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న ధోనిని.. మీ కెరీర్ లో బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరని అడిగితే వెంటనే స్పందిస్తూ.. ” వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్. ఈ ఇద్దరి బౌలింగ్ లో ఆడడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఇద్దరి స్పిన్ మాయాజాలంలో బ్యాటింగ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది” అని తెలిపాడు.
ఇక ఈ ఇద్దరు బౌలర్లు తమ వైవిధ్యాలతో ధోనీకి ఇప్పటికీ ఛాలెంజింగ్ గా మారారు. వీరి అనూహ్య డెలివరీలను మిస్టర్ కూల్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు. వీరి బౌలింగ్ లో తడబడుతూ తరచూ బౌల్డ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఈ సీజన్ లో కలకత్తా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నారు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న వీరిద్దరి బౌలింగ్ లో ఆడాలంటే ఏ జట్టుకైనా పెద్ద సవాల్ గా మారింది.
అయితే ఇదే సమయంలో ఎప్పుడూ కూల్ గా కనిపించే తాను.. చాలాసార్లు తన నిగ్రహాన్ని కోల్పోయానని ఒప్పుకున్నాడు. ” ఓసారి ఐపీఎల్ లో నేను సహనాన్ని కోల్పోయాను. ఓ మ్యాచ్ లో ఏకంగా మైదానంలోకి వెళ్లాను. అది చాలా పెద్ద తప్పు. అది కాకుండా కోపం వ్యక్తం చేసిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. నేను చాలా ప్రమాదంలో ఉన్న ఆట ఆడుతాం. కాబట్టి అన్ని మ్యాచ్లను గెలవాలనే ఒత్తిడి మాపై ఉంటుంది.
ఆ కారణంగా నేను చిరాకు లేదా నిరాశకు గురైనప్పుడు నోరు మూసుకుని ఉండాలి. కాసేపు దాని నుండి దూరంగా ఉండి, లోతైన శ్వాస తీసుకుని, ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను” అని తెలిపాడు. అయితే 2019 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో నో బాల్ వివాదం కారణంగా లైవ్ మ్యాచ్ సమయంలో ధోని మైదానంలోకి ప్రవేశించి అంపైర్ తో గొడవపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ధోని మ్యాచ్ ఫీజులో 50% కోత విధించారు.