Tamannaah: ప్రతీ హీరో లేదా హీరోయిన్‌కు డ్రీమ్ రోల్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే దర్శక, నిర్మాతలకు కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. వారి కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా డ్రీమ్ ప్రాజెక్ట్ చేయని లోటు అలాగే ఉండిపోతుంది. అయితే మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా అలాంటి డ్రీమ్ రోల్ ఒకటి ఉందనే విషయాన్ని తాజాగా బయటపడింది. ఇటీవల ఒక ఈవెంట్‌లో పాల్గొన్న తమన్నా తన డ్రీమ్ రోల్ గురించి బయటపెట్టింది. గత కొన్నేళ్లలో తన స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో చాలా మార్పులు చేసుకున్న ఈ మిల్కీ బ్యూటీ.. ఇప్పుడు ఒక సీనియర్ హీరోయిన్ బయోపిక్‌లో నటించాలని ఉందనే కోరికను ప్రేక్షకులతో పంచుకుంది.
అదే కోరిక
తమన్నా (Tamannaah) హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలాకాలం అయ్యింది. చాలామంది హీరోయిన్లలాగానే తమన్నా కూడా ముందుగా తెలుగులో అడుగుపెట్టి ఆ తర్వాతే ఇతర భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. చాలాకాలం సౌత్‌లో హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న తర్వాత తమన్నాకు బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు రావడం మొదలయ్యింది. అలా సౌత్, నార్త్ అన్ని కలిపి దాదాపు హాఫ్ సెంచరీ సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. తన యాక్టింగ్‌తో, డ్యాన్సులతో అందరినీ మెప్పించి మిల్కీ బ్యూటీ అనే పేరు కూడా దక్కించుకుంది తమన్నా. ఇన్నేళ్లలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించిన తమన్నాకు ఇంకా ఒక్క పాత్ర చేయాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయిందని చెప్పుకొచ్చింది.
ఆరాధిస్తూనే ఉంటాను
ఏ నటి బయోపిక్‌లో నటించాలని ఉంది అని అడగగా.. వెంటనే శ్రీదేవి (Sridevi) పేరు చెప్పింది తమన్నా. దానికి కారణం కూడా చెప్పుకొచ్చింది. ‘‘నేను ఎవరి బయోపిక్‌లో నటించాలని అనుకుంటున్నాను అంటే అది శ్రీదేవిదే. తను చాలా ఐకానిక్ అని నాకు అనిపిస్తుంటుంది. తనను నేనెప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాను’’ అంటూ శ్రీదేవిపై అభిమానాన్ని బయటపెట్టింది తమన్నా. ప్రస్తుతం శ్రీదేవి బయోపిక్ చేయాలంటే తన భర్త బోనీ కపూర్ పర్మిషన్ కావాలి. కానీ బోనీ కపూర్ మాత్రం శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించడానికి ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపించలేదు. అందుకే ఇప్పటివరకు ఈ సీనియర్ నటి బయోపిక్ ప్రస్తావన ఇండస్ట్రీలో రాలేదు. ఒకవేళ వస్తే దానికి తమన్నా కరెక్ట్ కాదా అని అప్పుడే ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి.
Also Read: వాళ్ల సిల్లీ ఆస్కార్ వాళ్ల దగ్గరే ఉండనివ్వు.. కంగనా షాకింగ్ కామెంట్స్
అఘోరీ పాత్రలో
ప్రస్తుతం తమన్నా.. ‘ఓదెల 2’ మూవీతో బిజీగా ఉంది. కొన్నాళ్ల క్రితం నేరుగా ఓటీటీలో విడుదయ్యి సూపర్ హిట్ అందుకున్న ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇందులో ఒక అఘోరీ పాత్రలో కనిపించనుంది తమన్నా. ‘ఓదెల 2’లో అఘోరీగా కనిపించనుందని తెలియగానే తమన్నా స్క్రిప్ట్ సెలక్షన్‌లో మార్పులు వచ్చాయని ప్రేక్షకుల్లో క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ముందుకు రాగా ఇందులో అఘోరీగా తమన్నా సరిగ్గా సరిపోయిందని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు. మిల్కీ బ్యూటీ హీరోయిన్‌గా నటించడంతో ‘ఓదెల 2’పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.