Mukesh Ambani: ఇంగ్లాండ్ – టీమిండియా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన చివరి 5 టీ-20 మ్యాచ్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ ని భారత్ 4-1 తేడాతో సొంతం చేసుకుంది. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ టీమ్ 10.3 ఓవర్లలో కేవలం 97 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు 150 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
Also Read: Abhishek Sharma: యూవీ చెప్పిందే చేశా.. 16వ ఓవర్ సీక్రెట్ చెప్పిన అభిషేక్
ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన అభిషేక్ శర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ ఐదవ టి-20 లో అభిషేక్ శర్మ అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. బంతి పడడమే ఆలస్యం.. అది బౌండరీ లో దర్శనం ఇవ్వాల్సిందే. అభిషేక్ మెరుపులతో వాంఖడే మైదానం దద్దరిల్లిపోయింది. కళ్ళు చెదిరే షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. కేవలం 17 బంతులు ఆడిన అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
అనంతరం సెంచరీ సాధించేందుకు 20 బంతులు ఆడాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 279 స్ట్రైక్ రేట్ తో 13 సిక్సర్లు, 7 ఫోర్ లతో 135 పరుగులు చేశాడు. బౌలింగ్ లో కూడా రెండు వికెట్లను పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ క్రమంలో శర్మ పలు రికార్డులను కూడా తన పేరున లిఖించుకున్నాడు. టి-20 ల్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్ గా నిలిచాడు. అలాగే టి-20 ల్లో భారత్ తరపున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.
అంతేకాకుండా 17 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేసిన ఫాస్టెస్ట్ ఫిఫ్టీల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. ఇవి మాత్రమే కాకుండా ఓ ఇన్నింగ్స్ లో భారత తరఫున అత్యధిక సిక్సులు కొట్టిన క్రికెటర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేసే సమయంలో వాంఖడే స్టేడియంలో ఉన్న అభిమానులంతా చప్పట్లు, ఈలలు, కేరింతలతో హోరెత్తించారు.
ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన బ్రిటిష్ మాజీ అధ్యక్షుడు రిషి సునాక్, బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అమీర్ ఖాన్, ఇతర ప్రముఖులు రాజీవ్ శుక్ల, ముఖేష్ అంబానీ.. ఇతర సెలబ్రిటీలు అంతా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ని ఎంజాయ్ చప్పట్లతో అభినందించారు. ఈ క్రమంలో ముఖేష్ అంబానీ అయితే సీట్ లో నుంచి లేచి నిల్చోని మరీ చప్పట్లు కొడుతూ అభిషేక్ శర్మని అభినందించాడు.
Also Read: Yuvraj Singh: ఏంట్రా నువ్వు.. నా కన్న భయంకరంగా ఆడుతున్నావు
ముఖేష్ అంబానీ నిలబడి మరీ చప్పట్లు కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు.. నీ ప్రదర్శనతో అంబానీనే నిలబెట్టావుగా అభిషేక్ శర్మ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ అనంతరం ముఖేష్ అంబానీ.. అభిషేక్ శర్మని ప్రత్యేకంగా కలిసి ఫోటోలు దిగినట్లు సమాచారం. ముఖేష్ అంబానీ తో పాటు ఆయన కుమారుడు కూడా అభిషేక్ శర్మతో ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అభిషేక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.